మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ఒడ్డున పడేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హతా పిటిషన్లను తోసి పుచ్చారు. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కు బీఆర్ఎస్ అనర్హతా పిటిషన్లపై దాఖలు చేస్తే ఇప్పటి వరకూ ఏడుగురిపై పిటిషన్లు కొట్టేశారు.
ఇంకా దానం నాగేందర్, కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్లు మత్రమే పెండింగ్ లో ఉన్నాయి. వీరిలో కడియం శ్రీహరి, సంజయ్ కూడా తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పీకర్ కు సమాధానం ఇచ్చారు. దీంతో వారిపై దాఖలైన అనర్హతా పిటిషన్లను కూడా స్పీకర్ తోసిపుచ్చడం ఖాయం. అయితే దానం నాగేందర్ అంశమే సస్పెన్స్ గా మారింది ఆయన కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారు కాబట్టి.. కాంగ్రెస్ లో చేరలేదని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.
ఈ అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. అయితే సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. గత చీఫ్ జస్టిస్ ఈ సీరియస్ గా తీసుకుని కామెంట్స్ చేశారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎలా స్పందిస్తారన్న దాన్ని బట్టి దానం నాగేందర్ విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది. మరో వైపు స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులేదా హైకోర్టులో బీఆర్ఎస్ సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి.
