కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను కూడా నిర్వహిస్తామని ప్రకటించింది. ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, దోషరహితంగా తీర్చిదిద్దేందుకు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా చెబుతున్నారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత చేపడుతున్న ఈ ‘ఇంటెన్సివ్’ రివిజన్ ద్వారా నకిలీ ఓట్లు, మరణించిన వారి పేర్లు , ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఓట్లను తొలగించడమే ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులు ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశమై, ఈ ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఎవరు వ్యతిరేకించినా ఆగదు!
SIR ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ స్వయంగా వచ్చి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. గతంలో ఉన్న సాధారణ సవరణల కంటే ఇది భిన్నమైనది; ఇక్కడ ఓటరు స్వయంగా దరఖాస్తు చేసుకోవడమే కాకుండా, అధికారులు ప్రతి ఇంటి తలుపు తట్టి వివరాలను సేకరిస్తారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ సమయం ఎంతో కీలకం. ఇంటింటి సర్వేలో అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాచారం అందిస్తూ, ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డుల ద్వారా వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత, మీ పేరు, ఇంటి నంబర్ , చిరునామా సరిగ్గా ఉన్నాయో లేదో ‘Voter Helpline’ యాప్ , వెబ్సైట్ ద్వారా సరిచూసుకోవాలి. నకిలీ ఓట్లను నిరోధించడానికి ఓటర్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయడం ఉత్తమం. ఇది భవిష్యత్తులో ఓటు గల్లంతు కాకుండా కాపాడుతుంది. కొత్త ఓటు కోసం ఫారమ్-6, తప్పుల సవరణకు ఫారమ్-8, అభ్యంతరాలు లేదా తొలగింపుల కోసం ఫారమ్-7ను ఉపయోగించాలి. నివాసం మారిన వారు పాత చోట ఓటును రద్దు చేయించుకుని, ప్రస్తుతం ఉంటున్న చోట కొత్తగా నమోదు చేసుకోవాలి. లేకపోతే ఓటు గల్లంతు అవుతుంది.
ఫిబ్రవరిలోనూ తుది ఓటర్ల జాబితా ప్రకటన
ఈ SIR 2025 ప్రక్రియ ద్వారా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కూడా జరగనుంది. ఒకే ఇంట్లోని సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు ఈ సవరణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని, తమ వివరాలను సరిచూసుకోవడం అత్యవసరం. లేకపోతే ఓట్లు గల్లంతు అవుతాయి.
