విడుదలకు ముందు ‘అఖండ 2’ సౌండింగ్ గట్టిగానే వినిపిస్తోంది. బాలకృష్ణ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా. కాబట్టి ఆ స్థాయిలోనే ప్రచారాన్ని చేస్తున్నారు. బాలయ్య కూడా అన్ని రాష్ట్రాల్లోనూ సుడిగాలిలా పర్యటిస్తున్నారు. మార్కెట్ పరంగానూ బాలయ్య కెరీర్లో భారీ సినిమా ఇదే. రూ.200 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమా పూర్తయ్యింది. నాన్ థియేట్రికల్ రూపంలో రూ.100 కోట్లు వచ్చాయని లెక్క. థియేట్రికల్ బిజినెస్ రూ.150 కోట్ల వరకూ సాగింది. అంటే.. నిర్మాతలు ఇప్పటికి రూ.50 కోట్ల లాభాల్లో ఉన్నారన్నమాట. ఓ భారీ సినిమా… విడుదలకు ముందే నిర్మాతలు సేఫ్ జోన్లో ఉన్నారంటే ఈ సినిమా క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవొచ్చు.
నిర్మాతలు రామ్, గోపీ ఆచంటలకు ఇది చాలా కీలకమైన చిత్రం. కొంతకాలంగా సరైన విజయాలు లేని 14 రీల్స్ సంస్థకు అఖండ 2 గట్టి బూస్టప్. దర్శకుడిగా బోయపాటి శ్రీను స్టామినాకు ఈ సినిమా పరీక్ష లాంటిది. బాలయ్యతో ఆయన ఎప్పుడు జట్టు కట్టినా సూపర్ హిట్టు కొట్టారు. ఒక సినిమాకు మించి మరో సినిమాని విజయతీరాలకు చేర్చారు. ఈసారి బడ్జెట్ పెరిగింది. అంచనాలు పెరిగాయి. మార్కెట్ పెరిగింది. వీటన్నింటినీ ఆయన ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరం. ట్రైలర్ లో రకరకాల అంశాలు కనిపించాయి. దైవత్వం, దేశభక్తి, హిందూ ధర్మం, సనాతన సంప్రదాయం, దుష్టశక్తులు.. ఇలా చాలా విషయాలు చూపించారు. వాటన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది ప్రధానం. విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం కూడా కనిపిస్తోంది. ఈరోజుల్లో వీఎఫ్ఎక్స్ తో వ్యవహారాలు అంత తేలిక కావడం లేదు. చేతిలో బడ్జెట్లు ఉన్నా, ఖర్చుకు వెనుకాడని నిర్మాతలు ఉన్నా, వీఎఫ్ఎక్స్ నుంచి కావాల్సిన అవుట్ పుట్ సాధించుకోవడం కష్టతరం అవుతోంది. బోయపాటి వీఎఫ్ఎక్స్ తో డీల్ చేసిన సినిమా ఇదేనేమో. ఆయన ఈ విభాగాన్ని ఎలా హ్యాండిల్ చేశారన్నది ఆసక్తిని కలిగిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ యేడాది రాబోతున్న ఆఖరి పెద్ద సినిమా ఇదే. ఆ తరవాత సంక్రాంతి హడావుడి మొదలైపోతుంది. 2025కి ఘనమైన ముగింపు ఇవ్వాలంటే…. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టాల్సిందే. బాలయ్య సినిమాపై ప్రేమతో, బోయపాటిపై నమ్మకంతో అన్ని ఏరియాల్లోనూ హయ్యస్ట్ రేటుకే ఈ సినిమా కొన్నారు. ఆ పెట్టుబడి రాబట్టాలంటే.. బాలయ్య గత సినిమా రికార్డులన్నీ ‘అఖండ 2’ తిరగరాయాల్సిందే. అదే జరిగితే.. 2025 క్యాలెండర్‌కి ఓ సూపర్ హిట్ తో గుడ్ బాయ్ చెప్పొచ్చు.