`రుద్రమదేవి’లో స్పెషాలటీ ఏంటీ ?

`బాహుబలి ది బిగెనింగ్’ సినిమా చూసిన అనుష్క అభిమానులు నిరుత్సాహపడిన మాట నిజమే కావచ్చు. వారి నిరుత్సాహానికి కారణం లేకపోలేదు. మొదటి భాగం సినిమాలో అనుష్క ముసలి రూపులో, కోద్రాగ్నితో భగభగమండే కళ్లతో, నారచీరలతో కనిపిస్తుంది. దీంతో `అయ్యో, మన అందాల అనుష్క ఇలా అయిపోయిందా…’ అంటూ తెగబాధపడిపోయిఉంటారు ఆమె అభిమానులు. అయితే రెండవ భాగంలో అనుష్క అందాలు ఆరబోయబోతుందట. బాహుబలి చివరి భాగం వచ్చే ఏడాది కానీ విడుదల కాదు. మరి, ఈలోగానే వారికి ఊరట కలిగించే విషయం ఏమంటే, త్వరలోనే రుద్రమదేవిలో పూర్తిస్థాయి నిడివిగల పాత్రలో ఇటు క్రోదం, అటు అందచందాలు అభిమానులు చూడబోతుండటం. ఈ ప్రత్యేకతో పాటుగా సాంకేతికంగా రుద్రమదేవి సినిమా మరో మెట్టు పైకెక్కుతోంది. గుణశేఖర దర్శకత్వంలో తయారైన రుద్రమదేవి చిత్రం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో బహుశా వచ్చే నెలలో విడదల చేయబోతున్నట్టు చెబుతున్నారు. ఈసినిమాలో అనుష్కతో పాటుగా రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ తదితరులు నటిస్తున్నారు.
రుద్రమదేవిలో అనుష్క నటన కీలకమైనదని వేరే చెప్పనక్కర్లేదు. టైటిల్ రోల్ ని వీరోచితంగా మలచారు దర్శకుడు. ఈ సినిమాని త్రీడిలో తీయకపోయినా నిర్మాణానంతరం సరికొత్త సాంకేతిక సొబగులు అద్ది 3డి లో చూశామన్న భావన ప్రేక్షకులకు కలిగించబోతున్నారు చిత్ర నిర్మాత కూడా అయిన గుణశేఖర. మామూలుగా 3డిలో సినిమా తీయడానికి అయ్యే ఖర్చులో సగం కూడా ఖర్చు చేయకుండానే ఇంచుమించు అదే ఎఫెక్ట్ తో ప్రేక్షకులకు సినిమా అందించడానికి గుణశేఖర ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ‘ఎన్‌హ్యాన్స్‌డ్ డెప్త్ సొల్యూషన్’ (ఈడీఎస్) అనే విధానం తో నిర్మాణానంతర సాంకేతిక సహాయంతో 2డి సినిమానే 3డి సినిమా భావన కల్పించేలా తీర్చిదిద్దారు. అమెరికాకు చెందిన ‘యింగ్ గ్రూప్’ సంస్థ ఆధ్వర్యంలో సాంకేతిక బృందం 2డి ఫిల్మ్ ని త్రీడీ ఎఫెక్ట్ వచ్చేలా ఈడీఎస్ పద్ధతిలో మార్పులు చేస్తున్నదట. ‘కింగ్ కాంగ్’, ‘కుంగ్ ఫూ పాండా’, ‘ఇన్‌సెప్షన్’, ‘అవతార్’ వంటి చిత్రాలకు త్రీడీ విభాగంలో ఈ సంస్థ పని చేసిన అనుభవం ఉండటంతో వారికే ఈ బాధ్యతను గుణశేఖర అప్పగించారు.
3డి సినిమాలు చూసేటప్పుడు ఉపయోగిస్తున్న ప్రత్యేక కళ్లజోళ్లను ఈ సాంకేతిక పరిజ్ఞానంతో విడుదలయ్యే సినిమాలకు వాడనక్కర్లేదు. మామూలు కళ్లతోనే సినిమా చూస్తుంటే ఈడీఎస్ వల్ల త్రీడీలో చూస్తున్నామన్న భావన ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే పూర్తిగా 3డి ఫిల్మ్ లా ఉండకపోయినా, ఆ తరహా భ్రాంతిని కలిగించడానికి ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందట. 2డి థియేటర్లలో చూసే ప్రేక్షకులకే కాదు, ఆ తర్వాత ఇంట్లో వీడియో చూస్తున్నా ఈ ఎఫెక్ట్ ని వీక్షకులు ఫీలవుతారని చెబుతున్నారు. ప్రత్యేకంగా తయారుచేసిన కొన్ని చిత్రాలను చూసినప్పుడు ఒక రకమైన భ్రాంతిలో పడిపోతుండటం మనకు తెలిసిందే. ఇంచుమించు ఈడీఎస్ సాంకేతికత ఇలాంటి భావననే కలిగిస్తుంది. 2డి వీడియో ఫ్రేమ్ ల్లో మార్పులు చేయడంతో ఇది సాధ్యమవుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పైగా 3డి సినిమా చూసేటప్పుడు తలనొప్పి వంటివి రావచ్చనీ, కానీ ఈ ఎఫెక్ట్ తో ఉన్న సినిమా చూస్తే ఆ ఇబ్బంది ఉండదని అంటున్నారు.
మొత్తానికి బాహుబలి తర్వాత మరో అద్భుత చిత్రం దక్షణాది ప్రేక్షకులు త్వరలోనే చూడబోతున్నారన్నమాట. ఇప్పటికే ప్రత్యేకతలను సొంతం చేసుకున్న రుద్రమదేవి రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]