కేరళలో భారతీయ జనతా పార్టీ వికసించడం ప్రారంభించింది. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఓ సీఎం ఫేస్ కూడా రెడీగా ఉన్నారు . కాకపోతే ఆ ఫేస్ ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కానీ బీజేపీతో దగ్గరగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేనట్లేగానే వ్యవహరిస్తున్నారు. ఆయనే శశిథరూర్. రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలంటే.. ముఖ్యంగా ఎదుగుతున్న పార్టీకి ఓ బలమైన నాయకత్వం కావాలి. కేరళలో ఇప్పటి వరకూ అలాంటి నాయకత్వాన్ని బీజేపీ పలుమార్లు టెస్ట్ చేసింది. రాజీవ్ చంద్రశేఖర్, సురేష్ గోపి సహా చాలా మందిని ప్రయత్నించింది. ఏదీ వర్కవుట్ కాలేదు. కానీ శశిథరూర్ మాత్రం అందరి కంటే బెస్ట్ ఆప్షన్ అవుతారు.
కేరళ సీఎం అభ్యర్థి కావాలనే కాంగ్రెస్‌తో పేచీ
అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు అయిన శశిథరూర్.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసి ఓడిపోయాక… ఇండియాకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తన సొంత రాష్ట్రం కేరళలోని తిరువనంతపురం నుంచి నాలుగోసారి ఎంపీగా గెలిచారు. ఆయన లక్ష్యం కేరళ సీఎం కావడమే. అయితే నాలుగో సారి గెలవక ముందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి .. పార్టీ హైకమాండ్ అభీష్టానికి వ్యతిరేకంగా అంతర్గత ఎన్నికల్లో పోటీ చేశారు. తరవాత ఆయనను కాంగ్రెస్ దూరం పెట్టింది. అయితే టిక్కెట్ మాత్రం ఇచ్చారు. నాలుగోసారి గెలిచారు. కానీ పార్టీకి మాత్రం దూరమయ్యారు. ఇటీవల జరిగిన అనేక పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీనే కానీ ఆ పార్టీ ఆఫీసు దరిదాపుల్లోకి పోలేని పరిస్థితి ఏర్పడింది.
మోదీకి బాగా దగ్గర అయిన శశిథరూర్
పహల్గం దాడుల తర్వాత ఇండియా చేసిన ఆపరేషన్ సిందూర్ .. గురించి ప్రపంచదేశాలకు వివరించేందుకు వెళ్లిన బృందంలో ఆయన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయనను పంపించారు. కానీ ఆయనను సిఫారసు చేయలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కానీ థరూర్ వెళ్లారు. అలాగే చాలా అంశాల్లో కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి ఆయనను ఉపయోగిస్తున్నారు. మోదీకి ఇప్పుడు శశిథరూర్ ఇష్టమైన నేత. తిరువనంతపురంలో బీజేపీ కార్పొరేషన్ సీటు గెల్చుకుంది. ఒక వేళ ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే తన సీటుకు ఢోకా ఉండదని ఆయన నమ్ముతున్నారు. మోదీకి కూడా ఆయనపై గురి ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలంగా పోటీ పడటం ఖాయమే
స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన విజయాలతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. 2026లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార లెఫ్ట్ డెమెక్రటిక్ ఫ్రంట్ తన ఓటు బ్యాంకును బీజేపీకి కోల్పోతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎప్..స్థానిక ఎన్నికల్లో అత్యధిక విజయాలు సాధించింది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ముక్కోణపు పోటీ జరుగుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులే కీలకం అవుతారు. శశిథరూర్ ..బీజేపీ సీఎం ఫేస్ గా నిలబడితే.. అదో అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మోదీ, షాల రాజకీయాలను .. ఎవరూ తక్కువ అంచనా వేయలేరు.
