కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మాస్ లీడర్ గా ఉన్న డీకే శివకుమార్ విషయంలో హైకమాండ్ తో పాటు.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరు .. ఆ పార్టీకి పెను సమస్యగా మారుతోంది. ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకు రావడానికి తన శక్తియుక్తులన్నింటినీ వెచ్చించిన ఆయనకు మిగిలింది డిప్యూటీ సీఎం పదవే. రెండేళ్ల పాటే ఉంటానని పదవిని తీసుకున్న సిద్ధరామయ్య.. తానే పూర్తి కాలం ముఖ్యమంత్రినని.. తన అనుచరులతో కలిసి డీకే శివకుమార్ పై బీజేపీకి లింకులు పెట్టే రాజకీయాలు ప్రారంభించారు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా మారుతోంది.
అంతర్గత రాజకీయాలతో డీకేపై బీజేపీ ముద్ర
కర్ణాటక కాంగ్రెస్ లో … వ్యక్తిగత ప్రాబల్యం ఏమీ లేకపోయినా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులుగా చెలామణి అయ్యేవాళ్లు చాలా మంది ఉన్నారు. వారంతా హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందనే పేరుతో రెచ్చిపోతూంటారు. వారికి ఉన్న ఒకే ఒక్క అడ్డం డీకే శివకుమార్. ఆయనపై బీజేపీ ముద్ర వేయడానికి చేయని ప్రయత్నాలు లేవు. ఇటీవల అసెంబ్లీలో ఆయన ఆరెస్సెస్ వాళ్లు వాడే ఓ పద్యం మాట్లాడారని చెప్పి ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఆయనపై బీజేపీతో టచ్ లో ఉన్నారని ప్రచారం చేయడం ప్రారంభించారు.
బీజేపీలో చేరి ఉంటే ఎప్పుడో డీకేకు సీఎం పదవి !
నిజానికి బీజేపీలో డీకే శివకుమార్ కు ఎప్పుడో ఆఫర్ ఉంది. గతంలో ఆయన ఈడీ కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందే ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది. బీజేపీకి నాయకత్వ సమస్య ఉంది. యడ్యూరప్ప తర్వాత సామాజికవర్గ పరంగా కూడా శివకుమార్ కు బీజేపీలో మంచి చాయిస్ ఉంది.
కానీ జైలుకెళ్లడానికి సిద్ధపడ్డారు కానీ బీజేపీలో చేరలేదు. పార్టీ కోసం కష్టపడ్డారు. అయితే ఇప్పుడు ఆయనను సొంత పార్టీనే అవమానిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్.. డీకే శ్రమను గుర్తించడానికి..ఏ మాత్రం ఇష్టపడటం లేదు. కష్టం ఆయనది.. కానీ పదులు మాత్రం ఇతరులకు అన్నట్లుగా హైకమాండ్ ఫార్ములా ఉంటుంది. ఆయనకు నిజంగా బీజేపీలో చేరే ఆలోచన ఉంటే…. గతంలోనే ఆయన ఆ పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లేవారని .. కర్ణాటకలో చెప్పుకుంటారు.
ఇక్కడ రేవంత్.. అక్కడ డీకేల్ని బలహీనపరిచి.. బీజేపీ ముద్ర వేసి ఏం సాధిస్తారు ?
కాంగ్రెస్ పార్టీకి ఓ రోగం ఉంటుంది. జన బలమున్న నేతల్ని కాకుండా.. తమను కాకాపట్టే వారిని మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్ లోని కొంత మంది పెద్దలు గొప్పగా చూస్తూంటారు. ధనబలం ఉన్న నేతల్ని తక్కువగా ట్రీట్ చేస్తూంటారు. వారి మాటలకు విలువ ఇస్తే వారు మరింతగా ఎక్కడ బలపడతారోనని ఆ పని చేస్తారేమో కానీ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చుకుంటున్నామని మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఇలా .. చేతకాని రాజకీయాలతో ఓడిపోవడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. మళ్లీ ఓట్ల చోరీ.. ఈవీఎంలు అంటూ.. రాజకీయాలు చేస్తూంటారు.