గంగ‌వ్వ చెప్పిన‌ శ్రీ‌విష్ణు ‘చోర గాథ‌’

శ్రీ‌విష్ణు… ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త త‌ర‌హా క‌థ‌లు ఎంచుకుంటుంటాడు. కొత్త‌ద‌ర్శ‌కుల్ని ప‌రిచ‌యం చేయ‌డంలో ముందుంటాడు. ఇప్పుడు కూడా అలాంటి క‌థే ఎంచుకున్నాడు. `రాజ రాజ చోర‌`. హ‌సిత్ గోళీ ద‌ర్శ‌కుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 18న టీజ‌ర్ రాబోతోంది. ఈలోగా… టీజ‌ర్ కోసం మ‌రో బుల్లి టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.

గంగవ్వ‌… ఈ టీజ‌ర్‌కి వాయిస్ ఓవ‌ర్ అందించింది. `ఊ కొట్టే క‌థ చెబుతా. ఊ కొడ‌తావా` అంటూ త‌న మ‌న‌వ‌రాలికి రాజు – దొంగ క‌థ చెపుతూ, సాగిన టీజ‌ర్ ఇది. 2డీ యానిమేష‌న్ లో రూపొందించారు. సూర్యుడు నుంచి భూమి, భూమి నుంచి కోతి బంగారం పుట్టింద‌ని, కోతి నుంచి మ‌నిషి, బంగారం నుంచి కిరీటం పుట్టుకొచ్చాయ‌ని, మ‌నిషి దొంగోడుగా, కిటీటం రాజుగా రూపాంత‌రం చెందాయ‌ని.. ఓ పేద‌రాసి పెద్ద‌మ్మ లా గంగ‌వ్వ‌.. క‌థ చెప్పుకుంటూ పోయింది. ఆ క‌థ చెప్పిన విధానం, క‌థ‌లో చూపించిన 2డీ యామినేష‌న్స్‌.. చాలా స‌ర‌దాగా సాగిపోయాయి. దొంగ రాజుగా, రాజు దొంగ‌గా మారిన వైనం… స‌ర‌దాగా ఉంది. బ‌హుశా… `రాజ రాజ చోర‌` కాన్సెప్టు కూడా అదేనేమో..? 2డీ యానిమేష‌న్ లో ఓ బుల్లి టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని, అందులో `రాజ రాజ చోర‌` కాన్సెప్టు చెప్పాల‌న్న ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న బాగుంది. సినిమాలో కూడా ఇలాంటి కొత్త ఆలోచ‌న‌లే ఉంటే… త‌ప్ప‌కుండా శ్రీ‌విష్ణుకి మ‌రో మంచి హిట్ ప‌డిన‌ట్టే. వివేక్ సాగ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణి, ర‌విబాబు, అజ‌య్ ఘోష్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.