తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడు రాహు-కేతు దోష నివారణ కోసం శ్రీకాళహస్తి వెళ్లాలని కోరుకుంటాడు. కానీ, ఆ పరమశివుని దర్శనం కంటే ముందు అక్కడ ఎదురయ్యే చేయి చాచే సంస్కృతి భక్తులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఇటీవల ఒక మహిళా భక్తురాలు సోషల్ మీడియాలో పంచుకున్న ఆవేదన అక్షర సత్యం. ఆలయ ప్రవేశం దగ్గరి నుంచి హారతి ఇచ్చే వరకు, చివరకు చెప్పులు వదిలే చోట కూడా అడగందే పని జరగని పరిస్థితి అక్కడ నెలకొంది. భక్తితో వెళ్లిన వారికి ఈ వసూళ్ల పర్వం ఒక మానసిక భారంగా మారుతోంది.
కాళహస్తి ఆలయానికి వెళ్లిన వారందరికీ తెలుసు!
మహిళ వీడియో వైరల్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అంతా బాగుంది, భక్తులను ఎవరూ డబ్బులు అడగడం లేదు అని చెప్పుకొచ్చారు. బహుశా ఆయనకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియక పోవచ్చు, లేదా తెలిసినా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండవచ్చు. ఎమ్మెల్యే హోదాలో ఆయన వెళ్తే ఆలయ సిబ్బంది, అర్చకులు అత్యంత గౌరవ మర్యాదలతో ప్రోటోకాల్ పాటిస్తూ పూజలు చేయిస్తారు. కానీ, ఏ అండదండలు లేని సామాన్య భక్తుడు క్యూ లైన్లో నిలబడితేనే అక్కడ అసలు రంగు బయటపడుతుంది. ప్రతి అడుగులోనూ దక్షిణ ఇస్తేనే దర్శనం సవ్యంగా సాగుతుందనే సంకేతాలు భక్తులకు అందుతూ ఉంటాయి.
ఎమ్మెల్యే తప్పులు సరి చేయాలి కానీ సమర్థించకూడదు!
శ్రీకాళహస్తి ఆలయ వ్యవస్థలో కొన్ని శక్తులు దశాబ్దాలుగా పాతుకుపోయాయి. మీడియా ప్రతినిధులు , ఉన్నతాధికారులు వెళ్తే వారికి రాజ మర్యాదలు చేసి పంపిస్తారు కాబట్టి, పైస్థాయిలో అంతా సవ్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ, సామాన్యుడి పాట్లు పాలకులకు పట్టడం లేదు. భక్తుడు తన కష్టాలను దేవుడికి చెప్పుకోవడానికి వస్తే, ఇక్కడ మనుషులు పెట్టే కష్టాలను భరించలేక పోతున్నాడు. ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగి వ్యవస్థను సమర్థించుకోవడం వల్ల ఎటువంటి మార్పు రాదు సదా సరికదా, అది ఆ పాతుకుపోయిన శక్తులకు మరింత ఊతమిచ్చినట్లు అవుతుంది.
కఠినమైన నిఘా ఉండాలి!
నిజమైన మార్పు రావాలంటే, ఆలయంలో భక్తులను వేధించే వసూళ్లను అరికట్టాలి. సీసీ కెమెరాల నిఘా పెంచడమే కాకుండా, ఫిర్యాదు చేసేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. భక్తుడు రూపాయి ఖర్చు లేకుండా, ప్రశాంతంగా ధ్యానం చేసుకుని, స్వామిని దర్శించుకుని వచ్చే వాతావరణం కల్పించినప్పుడే ఆ క్షేత్రానికి పవిత్రత దక్కుతుంది. పాలకులు అద్దాల మేడల్లో కూర్చుని ఇచ్చే సర్టిఫికెట్ల కంటే, సామాన్య భక్తుడి ముఖంలో కనిపించే తృప్తి ముఖ్యం. వ్యవస్థలో లోపాలను అంగీకరించి దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పుడే శ్రీకాళహస్తికి పూర్వవైభవం వస్తుంది.
