ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో ఇరుక్కోవడం నటుడు శ్రీకాంత్ అయ్యంగార్కి అలవాటే. తాజాగా ఆయన మరోసారి వివాదాలకెక్కారు. జాతిపితని అవమానిస్తూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అక్టోబరు 2 డ్రై డే. ఆ రోజున మన దేశంలో మద్యం దొరకదు. అందుకే శ్రీకాంత్ అయ్యంగార్ పుకెట్ వెళ్లిపోయార్ట. అక్కడ్నుంచి ఓ సెల్ఫీ వీడియో వదిలారు.
మందు అమ్మడం లేదని పుకెట్ వచ్చా, హాలీడేకి అంటూ మహాత్మాగాంధీపై శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే… కనీసం రాయడానికి కూడా మనసొప్పడం లేదు. తాగిన మత్తులో ఆయన వాగి ఈ వీడియో చేశారనుకోవడానికి వీల్లేదు. తాగితే ఏదైనా చేస్తారా? ఏమైనా అనేస్తారా? మద్యం కోసం ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఎన్ని విలాసాలైనా చేసుకోవొచ్చు. కానీ మహాత్ముడ్ని అవమానించడం ఏమిటి? జాతిపితని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్టు కాదా? ఈ విషయంలో ఈ నటుడిపై ఎవరు ఎలాంటి చర్య తీసుకొంటారు? కనీసం `మా` లాంటి సంస్థలు సైతం పట్టించుకోవా? అనేది ప్రశ్న.
శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం కొత్త కాదు. ఆయన ఇది వరకు కూడా కొన్ని ఘాటు కామెంట్లు చేశారు. ముఖ్యంగా మద్యానికి సంబంధించి ఆయన చేసిన వీడియోలో అప్పట్లో వైరల్ అయ్యాయి. వాటిని చాలామంది సరదాగా తీసుకొని ఉండొచ్చు. కానీ ఈసారి మాత్రం అలా కాదు. ఏకంగా గాంధీపైనే ఆయన విమర్శలు చేసే స్థాయికి ఎదిగారు. గాంధీ భావజాలాన్ని ఎవరైనా విమర్శించొచ్చు. తప్పులేదు. కానీ వ్యక్తిగత దూషణ మాత్రం క్షమించరాని నేరం. ‘మా’ ఈ విషయాన్ని చూస్తూ ఊరుకోవొచ్చు గాక.. కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం ఊరుకోకూడదు.