హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా పేరున్న ఖానామెట్ లో భారీ భూ మోసం వెలుగులోకి వచ్చింది. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని తమదంటూ నమ్మించి, అమాయక కొనుగోలుదారుల నుండి కోట్లు వసూలు చేసిన శ్రీ వెన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులతో పాటు సంస్థ డైరెక్టర్లపై చీటింగ్ కేసులు నమోదయ్యాయి.
అల్లాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త జైనీ మహేష్‌ను 2025 జూన్‌లో కటంరెడ్డి శశిధర్ రెడ్డి అనే వ్యక్తి సంప్రదించాడు. ఖానామెట్‌లోని సర్వే నంబర్ 11/33లో ఉన్న 1,070 గజాల స్థలం తమదేనని, సౌమ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, విష్ణు వైభవ్ అనే వ్యక్తులతో కలిసి తాము దానికి యజమానులమని నమ్మబలికాడు. వీరి మాటలు నమ్మిన మహేష్ , మరో తొమ్మిది మంది కొనుగోలుదారులు ఆ స్థలాన్ని రూ. 9.66 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా రూ. 3.5 కోట్లను బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో నిందితులకు చెల్లించారు.
డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నెలల తరబడి వాయిదా వేస్తూ వచ్చారు. తీరా అనుమానం వచ్చి కొనుగోలుదారులు రంగారెడ్డి జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి విచారించగా, ఆ భూమి ప్రభుత్వం నిర్దేశించిన నిషేధిత జాబితా లో ఉందని తేలింది. అంటే ఆ భూమిని క్రయవిక్రయాలు చేయడానికి చట్టపరంగా వీలు లేదు. అంతేకాకుండా, నిందితులు అదే స్థలాన్ని ఒక పబ్ నిర్వహణ కోసం లీజుకు ఇచ్చినట్లు కూడా బాధితులు గుర్తించి షాక్‌కు గురయ్యారు.
తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నిందితులు కటంరెడ్డి శశిధర్ రెడ్డి, విష్ణు వైభవ్, సౌమ్య, సుబ్రహ్మణ్యం రెడ్డిలపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. వసూలు చేసిన కోట్లాది రూపాయలను నిందితులు ఎక్కడికి మళ్లించారనే కోణంలో మనీ ట్రైల్‌ను పరిశీలిస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద భూముల విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని, డాక్యుమెంట్లు సరిచూసుకోకుండా పెద్ద మొత్తంలో అడ్వాన్సులు ఇవ్వకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
