మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈనెల 15 గ్లింప్స్ బయటకు రాబోతోంది. అందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ 100 అడుగుల ఎత్తులో ఓ భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్ మీదే… గ్లింప్స్ చూడబోతున్నారు ఫ్యాన్స్.
ఈలోగా ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్ బయటకు వస్తున్నాయి. ముందుగా ఫృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. కుంభగా ఆయన పాత్రని పరిచయం చేసింది. లుక్ పరంగా కొన్ని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పాత సినిమాల్లోని విలన్ లుక్స్ తో.. కుంభని పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే.. ఈ కథకూ, పురాణాలకూ లింక్ ఉందన్న విషయం ముందు నుంచీ చక్కర్లు కొడుతూనే ఉంది. రామాయణం రిఫరెన్స్ గా రాజమౌళి ఈ సినిమా చేస్తున్నారని చెప్పుకొంటూనే ఉన్నారు. మహేష్ రాముడిగా, హనుమంతుడిగా కనిపిస్తారని, ఆ పాత్రల్ని రిఫరెన్స్ గా చేసుకొని.. మహేష్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విలన్ కు కుంభ అనే పేరు పెట్టడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టైంది.
రామాయణంలో కుంభుడు అనే పాత్ర వుంది. తనది రాక్షస జాతే. కుంభకర్ణుడి కుమారుడైన కుంభుడు రామ – రావణ యుద్ధంలో పాల్గొన్నాడు. కాబట్టి.. ఈ కథకూ, రామాయణానికి లింకు ఉన్నట్టే అనుకోవాలి. కాకపోతే.. కుంభుడ్ని సంహరించింది రాముడో, హనుమంతుడో కాదు. సుగ్రీవుడు. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ఇప్పుడు మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా పాత్ర ఎవరిని పోలి ఉంటుందన్న చర్చ మొదలైంది. మాధవన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారని, అందుకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగిందన్న ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గ్లింప్స్ లో ఈ పాత్రకు సంబంధించిన క్లూ ఏమైనా ఇస్తారేమో చూడాలి.
