SSMB 29 అప్ డేట్స్ అన్నీ నవంబరులోనే అని రాజమౌళి ఎప్పుడో హింట్ ఇచ్చేశాడు. అన్నట్టుగానే నవంబరు నెల మొదలైందో, లేదో.. మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాల పట్ల చర్చ మొదలైపోయింది. ఈనెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. ఈ ఈవెంట్ ని ప్రసార హక్కుల్ని హాట్ స్టార్ సంస్థకు అమ్మేశారు. ఇదే కాదు… ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఈవెంట్లూ హాట్ స్టార్ కే విక్రయించినట్టు టాక్. ఈ రూపంలో నిర్మాతకు భారీ మొత్తం అందబోతోంది.
మరింతకీ ఈ సినిమా టైటిల్ ఏమిటి? ఇప్పుడు అందర్నీ ఊరిస్తున్న ప్రశ్న ఇదే. ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ పెట్టినట్టు ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఈ టైటిల్ ఏమంత పవర్ ఫుల్ గా లేదని, పాన్ వరల్డ్ టైటిల్ కాదని ఫ్యాన్సు పెదవి విరిచారు. రాజమౌళి టైటిల్ మరీ ఇంత సింపుల్ గా ఎందుకు ఉంటుందిలే అని చాలామంది లైట్ తీసుకొన్నారు. దానికి తగ్గట్టే ఓ చిన్న సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ పెట్టి, పోస్టర్ కూడా వదిలారు. దాంతో మహేష్ సినిమా టైటిల్ ఇది కాదులే అని అంతా డిసైడ్ అయిపోయారు.
అయితే ఈ సినిమా టైటిల్ వారణాసినే అని.. దీన్ని 15న అధికారికంగా ప్రకటించబోతున్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే ఛాంబర్ లో మరో నిర్మాత ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకొన్నాడు కాబట్టి, వాళ్ల అనుమతి తీసుకోవాల్సివుంది. లేదంటే వారణాసికి ముందో వెనుకో ఓ పదాన్ని జోడిస్తారు. మరి ఇన్నాళ్లూ ఈ టైటిల్ వద్దనుకొన్న మహేష్ ఫ్యాన్స్ ఈసారి ఎలా స్పందిస్తారో చూడాలి.
టైటిల్ గ్లింప్స్ దాదాపు 3 నిమిషాల వరకూ ఉంటుందని టాక్. ఈ గ్లింప్స్ ని ప్రదర్శించడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ తెర ఏర్పాటు చేస్తున్నార్ట. కనీసం లక్షమంది అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరు అవుతారని టాక్. టాలీవుడ్ లోనే కాదు, దేశంలోనే ఇలాంటి ఈవెంట్ జరగలేదు అనుకొనేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నార్ట. రాజమౌళి ఏం చేసినా ఇంతేగా. కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తారు. ఈసారీ అదే జరగబోతోంది.
