హిందీపై నిషేధం విధించాలని స్టాలిన్ నిర్ణయించుకున్నారు. తమిళనాడులో అనూహ్యంగా రాజకీయ వాతావరణం మారిపోతూండటంతో ఆయన భావోద్వేగ అంశాలపైనే ఎక్కువగా ఆధారపడాలని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. కరూర్ ఘటన తర్వాత రాజకీయం మరింత సున్నితంగా మారింది. దీంతో హిందీ అంశాన్ని మరోసారి స్టాలిన్ తెరపైకి తీసుకు వచ్చారు.
హిందీ సినిమాలు, హిందీ ప్రకటనలు సహా.. హిందీని నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారు. విజయ్ .. బీజేపీకి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తూండటంతో స్టాలిన్ హిందీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. బీజేపీ హిందీ బ్యాన్ కు వ్యతిరేకం. హిందీ ఉండాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. సైద్ధాంతికంగా విజయ్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పడిపోతారు. గతంలో ఆయన హిందీ రుద్దడాన్ని వ్యతిరేకించారు. కరూర్ ఘటన తర్వాత ఆయన అంత తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు లేవని భావిస్తున్నారు.
అయితే అసెంబ్లీలో బిల్లు పెట్టినా సరే .. హిందీని నిషేధించడం రాజ్యాంగపరంగా సాధ్యం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మన దేశంలో ఏ భాషపైనా ఎక్కడా నిషేదం ఉండదు. ఎవరి భాషపై వారు అభిమానం పెంచుకోవచ్చు కానీ ఇతర భాషల్ని నిషేధించడం ఉండదు. అందుకే ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినా.. చట్టంగా మారకపోవచ్చని అంటున్నారు. కానీ చట్టంగా మారినా మారకపోయినా.. వివాదం అయితే ఏర్పడుతుంది. డీఎంకే కు కావాల్సింది అదే.