తెలుగు చిత్రసీమలో వన్, టూ, త్రీ అనే లెక్కలు సినిమా సినిమాకీ మారిపోతుంటాయి. ఓ యేడాది ఓ స్టార్ హీరో చెలరేగిపోతాడు. రికార్డులన్నీ తిరగరాస్తాడు. మరో యేడాది ఆ రికార్డుల్ని ఇంకో హీరో బద్దలు కొట్టేస్తాడు. అందుకే టాలీవుడ్లో వన్, టూ, త్రీ అంటూ.. హీరోలకు రేటింగులు ఇవ్వడం కష్టం. అంకెలన్నీ యేడాదికే పరిమితం. గత నాలుగేళ్లలో నెంబర్ వన్ స్థానం కోసం మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌ల నుంచి గట్టి పోటీ ఉండేది. గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో పవన్ నెంబర్ వన్ అనిపించుకొంటే… దూకుడు, శ్రీమంతుడుతో పాత రికార్డులకు చెల్లు చీటి రాశాడు మహేష్. అయితే ఈ ఇద్దరికీ ఈయేడు ఏమాత్రం కలసి రాలేదు. మహేష్ నుంచి వచ్చిన బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాపుల లిస్టులో చేరిపోయింది. పవన్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ అంచనాలు అందుకోక తల్లకిందులైంది. దాంతో ఎన్టీఆర్ సడన్‌గా రేసులోకి వచ్చాడు. రావడమే కాదు.. దిమ్మతిరిగే వసూళ్లతో బ్లాక్ బ్లస్టర్ హిట్ అందించాడు. తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు… జనతా గ్యారేజ్‌తో.
సరైనోడుతో బన్నీ కాస్త పోటీ ఇచ్చినా… ఎన్టీఆర్ స్థాయిలో ఆ సినిమా వసూళ్లు అందుకోలేకపోయింది. ఈ యేడాది నెంబన్ వన్ ఎన్టీఆరే.. అనుకొంటున్న దశలో ధృవ విడుదల ఎన్టీఆర్ అభిమానుల్ని కాస్త కలవరపరిచింది. ధృవ ఏమైనా వంద కోట్ల క్లబ్లో చేరుతుందా? అనే ఆశలు, సందేహాలూ వ్యక్తం అయ్యాయి. అయితే ధృవకి అంత సీన్ లేదని తొలి రోజే అర్థమైపోయింది. అందుకే 2016 లో నెంబర్ వన్ కిరీటం ఎన్టీఆర్ సొంతమైంది. నిజానికి మిగిలిన హీరోల కంటే సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్నది ఎన్టీఆరే. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్లతో వరుస హిట్లు కొట్టాడు. హ్యాట్రిక్ అందుకొన్నాడు. ఎన్నాళ్ల నుంచో కలగా ఊరిస్తున్న రూ.50 కోట్లు, వంద కోట్ల మైలు రాళ్లని కూడా ఈజీగా అందుకొన్నాడు. సో.. స్టార్ ఆఫ్ ది ఇయర్ ఎన్టీఆరే.