“ చిన్న క్లూతో హత్యనేరం చేధించిన పోలీసులు” అనే హెడ్డింగ్‌తో గత ఆరేళ్ల కాలంలో కొన్ని వందల వార్తలు మీడియాలో వచ్చి ఉంటాయి. కానీ అన్ని ఆధారాలు కళ్ల ముందు ఉన్న వివేకా హత్య కేసు మాత్రం ఇంకా తేలలేదు. అన్ని ఆధారాలు కళ్ల ముందే ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం కేసును చేధించలేకపోయారు. సీబీఐకి ఇచ్చారు కానీ.. సుప్రీంకోర్టు చేతులు కట్టేసింది. దర్యాప్తు లేదు.. విచారణ లేదు.. ఓ హత్యకేసు ఎందుకిలా సాగుతోంది ?
సమయం చూసుకుని నరికి చంపారు. తర్వాత గుండెపోటు అని ప్రచారం చేశారు. రక్తం ఉందని రక్తపు వాంతుల కథ అల్లారు. గాయాలకు కట్లు కట్టారు. పోస్టు మార్టం లేకుండా అంత్యక్రియలు చేసేద్దామనుకున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తారు ?. హంతకులు దొరికిపోకుండా చేసే ప్రయత్నాలు ఇవని సాధారణ సీఐడీ సీరియల్స్ చూసేవారికి తెలిసిపోతుంది. మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు.
సీబీఐ విచారణ జరిపితే.. నిందితుడ్ని అరెస్టు చేయడానికి వెళ్తే.. అతడు కర్నూలు ఆస్పత్రిలో దాక్కుకుని.. టెర్రరిస్టుల మాదిరిగా చూట్టూరా ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండి.. హైకోర్టు నుంచి అరెస్టు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. వ్యవస్థల పనితీరు సైతం నేరస్తుల్ని ఎలా కాపాడుతుందో కళ్ల ముందు కనిపించే ఘటన అది. దేశ చట్టాలను, వ్యవస్థలను ఆ నేరస్తుడు ధిక్కరించాడని తెలిసినా రిలీఫ్ వచ్చింది.
ఆ హత్య గురించి పక్కా ప్లాన్ చేశారని బయట ప్రపంచానికి తెలియక ముందే ముందుగానే ఆ న్యూస్ జగన్, భారతికి తెలిసిందని ఆధారాలు వచ్చే సరికి విచారణ ఆగిపోయింది. సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నా .. స్పందన లేదు. ప్రభుత్వాలు మారినా పట్టించుకునేవారు లేరు. వ్యవస్థలూ అంతే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ వ్యవస్థలపై నమ్మకం పెట్టుకోగలరు ?