చండీయాగం, సూటి ప్రశ్నలు

చండీయాగం అనగానే అనేక అనుమానాలు, అంతే స్థాయిలో ప్రశ్నలు.మరి సమాధానాలు తెలుసుకోవద్దా…

ఆస్తికులకు అచంచల విశ్వాసమే బలం. నాస్తికులకు హేతువు లేదన్న వాదనే బలం. కరువుకాటకాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి భగవంతుడొక్కడే కాపాడగలడని ఆస్తికుల నమ్మకం. ప్రతి దానికీ ఆధారాలు చూపమంటాడు నాస్తికుడు. ఆస్తిక – నాస్తిక సంవాదం ఈనాడు కొత్తగా వచ్చిందేమీకాదు. అనాదిగా జరుగుతున్న పోరాటం. ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసివస్తున్నదంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అయుత మహా చండీయాగాన్ని ఎర్రవెల్లిలో ఈరోజు (బుధవారం – 23-12-15) ప్రారంభించారు. చాలా అట్టహాసంగా సంపూర్ణ విశ్వాసంతో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ఈ యాగం ఆరంభమైంది. ఈ సందర్భంగా కొన్ని సూటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. చండీయాగం వంటి క్షుద్ర యాగాల వల్ల జనంలో మూఢనమ్మకాలు పెరిగిపోవా ?

సమాధానం : ఒక్క ఈ యాగం వల్లనే మూఢనమ్మకాలు పెరిగిపోతాయని కచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. అసలు ఏది మూఢనమ్మకమన్నదే పెద్ద ప్రశ్న. మనకు తెలియనంతవరకు, అర్థంకానంతవరకు ప్రతి చేష్ట మూఢంగానే కనిపిస్తుంది. మూఢ నమ్మకం వల్ల జంతుబలి, లేదా నరబలి వంటివి జరుగుతున్నా, దీర్ఘకాలంలో ప్రజలు అనాగరికులుగా మారినా, లేదా మూఢనమ్మకాన్ని ఆచరించడం వల్ల ప్రజలు అనారోగ్యం లేదా అరిష్టాలకు గురవుతున్నా దాన్ని నివారించవలసిందే. సరే, ఇప్పుడు జరుగుతున్న చండీయాగం అసలు క్షుద్రమైనదా, కాదా అన్నది చూద్దాం. చండీయాగం నిర్వహణలో అనుసరించే పద్ధతిని బట్టి అది క్షుద్రమా, కాదా అన్నది తేలుతుంది. చండీయాగాన్ని రెండు రకాల ఆచారాల్లో నిర్వహించవచ్చు. అందులో 1. వామాచారం. 2. దక్షిణాచారం. వామాచార పద్ధతిలో రక్త, మాంసాది నైవేద్యాలు, శ్మశానంలో పూజల్లాంటివి ఉంటాయి. ఇక దక్షిణాచారం ప్రకారం బలి ఇవ్వడానికి బదులుగా కొబ్బరికాయలు కొడతారు. రక్త మాంసాది నైవేద్యాలకు బదులుగా పళ్లు, పండ్ల రసాలు సమర్పిస్తారు. పరిమిళ ద్రవ్యాలు, పవిత్రజలాలు ఉపయోగిస్తారు. ఉపాసకులు ఎలాంటి మార్గం ఎంచుకుంటారన్నది వారివారి ఆలోచనలనుబట్టి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న చండీయాగ పద్ధతి ఏమిటో చూసి మీరే ఆలోచించండి.

2. యాగాల వల్ల వర్షాలు పడతాయా ?

సమాధానం : ఈ ప్రశ్న కొందరు అడుగుతున్నారు. యాగం లేదా యజ్ఞం వల్ల వర్షం అప్పటికప్పుడు కుండపోతగా వర్షం పడుతుందని వీరికి ఎవరు చెప్పారు? ఇలాంటి క్రతువుల వల్ల శాంతిస్థాపన జరుగుతుందనే పెద్దలు చెప్పారు. శాంతి స్థాపన అంటే, ప్రజలకు కావాల్సిన కనీసపు అవసరాలు తీరడం, శత్రుభయం లేకుండా ఉండటం. అంతేకానీ, యజ్ఞయాగాదులు జరుగుతుండగానే కారుమేఘాలు కమ్ముకుంటాయన్న భావన సినిమాలు చూడటం వల్ల కలిగిందే.

వర్షాలు ఎప్పుడు పడతాయి? ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడుతుందన్నది సశాస్త్రీయమనుకుంటున్న వాతావరణ శాస్త్రవేత్తలు సైతం చెప్పలేకపోతున్నారు. ఇవీవీలేని రోజుల నుంచి వానలు పడేతీరుపై సూచనలు చెబుతుండేవారు. యజ్ఞయాగాదుల వల్ల నేరుగా వర్షం పడకపోవచ్చు. కానీ ప్రజలందరిలో మనోధైర్యం పెరుగుతుంది. కాస్త ఓపికపడితే తప్పకుండా పరిస్థితులు మెరుగవుతాయన్న నమ్మకం కలుగుతుంది. కష్టాలు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఎలా ఉపయోగపడతాయో, అలాంటి ప్రయోజనమే సమాజానికి ఈ యజ్ఞయాగాదులు అందిస్తున్నాయి. అంటే ఇక్కడ ముఖ్యమైనది- నమ్మకమే. అదే దైవం, అదే యాగం, అదే యజ్ఞం.

3. ఇంత డబ్బు తగలేయడం అవసరమా ?

సమాధానం : కేసీఆర్ చేస్తున్న మహా చండీయాగానికి 15 కోట్ల రూపాయలదాకా ఖర్చుపెడుతున్నారని అంటున్నారు. ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు సర్వసాధారణంగా `ఎంత ఖర్చు పెడుతున్నారు?’ అని ఆరాతీయడం మామూలే. ప్రజల సంక్షేమం కోసం చండీయాగం వంటిది నిర్వహించేటప్పుడు ఎంత ఖర్చు అయిందన్న లెక్కలకంటే ఎంత విలువైన మానసిక ధైర్యం అటు పాలకులకూ, ఇటు ప్రజలకు కలిగిందన్నది ముఖ్యం. సీతాదేవి దూరమైనప్పుడు రాముడు రాజసూయయాగం చేస్తాడు. ఇందుకోసం బంగారు సీతను తయారుచేయిస్తాడు. మానసికంగా క్రుంగిపోయిన రాముడికి ఈ యాగం వల్ల మానసిక బలం చేకూరింది. దీంతో పరిపాలన సవ్యంగా సాగింది. ప్రజలు సంతోషించారు. వినోదం కోసం బాహుబలి వంటి చిత్రనిర్మాణానికి వందలాది కోట్లు ఖర్చుచేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఖర్చు పెడితే దాన్ని అపహాస్యం చేయడం ఎందుకు ?

4. మంత్రాలకు చింతకాయలు రాలతాయా ?

సమాధానం : శబ్దానికి ఉన్న శక్తి తెలియని వాళ్ళు అడ్డంగా వాదిస్తూ అనే మాటలివి. మంత్రమన్నది కొన్ని అక్షరాల సమాహారం. వాటిని నిర్ధుష్ట పద్ధతిలో పలికితే, కచ్చితంగా ఫలితం ఉంటుంది. అంటే మంత్రంలో శబ్దానికి ఓ లయ ఉంటుంది. మనోసంకల్పంతో మంత్రాన్ని పలకగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ అంతటి వ్యక్తి దొరకాలి. శక్తిసంపన్నులైన ఋషులుకు ఆ శక్తి ఉండేది. కాలప్రవాహంలో మంత్రశక్తిని ధారణ చేయగలిగినవారు తగ్గిపోయారు. అర్భకులు పలికే మంత్రాలకు చింతకాయలు కూడా రాలేవికావు. అలా పుట్టుకొచ్చిన సామెతేకానీ, నిజానికి శబ్దానికి శక్తి లేదని కాదు. శబ్ద శక్తితో ఎన్ని పనులు జరుగుతున్నాయో ఓసారి సైన్స్ పుస్తకాలు తిరగేస్తే తెలుస్తుంది.

5. మనం మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్నామా ?

సమాధానం : దైవధ్యానం చేయడం వల్ల వెనక్కి వెళ్లినట్లు కాదు. నాగరికత మరిచిపోయి ప్రవర్తించడం వల్లనే వెనక్కి వెళ్ళినట్లు లెక్క. కదిలే బస్సులో అత్యాచారం చేయడం, ఇతరుల ఆస్తులను లాక్కోవడం, ఏ రకంగానూ ఆరోగ్యానికి పనికిరాని ఆవు మాంసం తినడం వంటి చేష్టల వల్లనే వెనక్కి వెళ్ళిపోతున్నాం. సైన్స్ నిరూపించలేనివన్నీ నిజం కాదనుకోవడం భ్రమ. చాలా విషయాలపై సైన్స్ ఈనాటికీ సహేతుకమైన వివరణలు ఇవ్వలేకపోతున్నది. మనకు తెలియనివి, మనకు కనిపించనివి ఎన్నో ఉన్నాయి. మిడిమిడి జ్ఞానంతో తమకంతా తెలుసనుకోవడం వెఱ్ఱి. మనదేశానికి ఇతర దేశాల నుంచి శత్రుభయం, ఉగ్రవాద భయం వాటిల్లినప్పుడు మన సంస్కృతి, సదాచారాలే రక్షరేకులుగా నిలిచాయి. ఇదే చరిత్ర చెప్పిన సత్యం. పూలమాలలో దారంలాంటి మన సంస్కృతి ఉన్నంతవరకే ఆ దేశం సస్యశ్యామలం. ఎప్పుడైతే దారం తెగిపోతుందో అప్పుడు శత్రువుల చేతుల్లోకి దేశం వెళ్ళిపోతుంది. అదే జరిగితే ప్రజాస్వామ్యంగా మనకు దక్కుతున్న స్వేచ్ఛా ఫలాలు కోల్పోతాం. అప్పుడు నిజంగానే వెనక్కి వెళ్ళిపోతాం. అలా జరగకుండా ఉండాలంటే, దారం తెగకుండా చూసుకోవాలి. అందుకు ఇలాంటి క్రతువులు అక్కరకు వస్తాయి. శాంతియుతంగా సాగుతున్న యాగాలపై బురదజల్లడానికి ప్రయత్నించకండి. వీలైతే సపోర్ట్ చేయండి. లేదంటే మౌనంగా ఉండండి. తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నిరసన తెలపవలసిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిమీద ఫోకస్ చేయండి. అది చాలు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close