ఇంత‌కీ… అవిశ్వాసానికి భాజ‌పా ఎందుకు ఒప్పుకున్న‌ట్టు..?

గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల్లో కూడా మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాలు వెల్లువెత్తాయి. అయినా చ‌ర్చ‌కు అనుమ‌తించ‌లేదు. కానీ, ఈ స‌మావేశాల్లో టీడీపీ నోటీసులు ఇవ్వ‌గానే.. చ‌ర్చ‌కు మోడీ స‌ర్కారు సిద్ధ‌మైంది. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఏంటి తేడా..? ఇది టీడీపీ, భాజ‌పా కుమ్మ‌క్కు రాజ‌కీయం అని వైకాపా నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు ప‌క్క‌న‌బెడ‌దాం. వాస్త‌వంగా.. భాజ‌పాని అవిశ్వాస తీర్మానానికి అనుమ‌తించే విధంగా ప్ర‌భావితం చేసిన అంశాలేవి..? గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల‌కూ ఈ స‌మావేశాల‌కూ మారిన రాజ‌కీయ ప‌రిస్థితులేంటి..? అవిశ్వాసం ఎదుర్కొన‌డం ద్వారా భాజ‌పా కూడా ఏదో ఒక ప్ర‌యోజ‌నం ఆశించ‌కుండా ఎలా ఉంటుంది..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానాలున్నాయి.

నిజానికి, టీడీపీ ఇచ్చిన ఈ అవిశ్వాసం వ‌ల్ల మోడీ స‌ర్కారు ప‌డిపోయే ప‌రిస్థితి లేనే లేదు. ఏపీ స‌ర్కారు ల‌క్ష్యం కూడా రాష్ట్ర ప్రయోజ‌నాల‌పై పార్ల‌మెంటులో చ‌ర్చ జ‌ర‌గాల‌న్న‌దే. భాజ‌పాకి 272 మంది స‌భ్యులున్నారు. సొంతంగా బొటాబొటీ మెజారిటీ ఉంది. ఎన్డీయేలో మ‌రో 39 మంది ఉన్నారు. స‌రే, వీరిలో స‌గం మంది స‌భ్యులు వ్య‌తిరేకంగా ఓట‌సినా.. మోడీ స‌ర్కారుకు జ‌రిగే న‌ష్ట‌మేమీ లేదు. మరెందుకు సిద్ధమైందంటే.. గ‌త స‌మావేశాలు మాదిరిగానే ఈ స‌మావేశాల్లోనూ గంద‌ర‌గోళం నెల‌కొంటే… దేశ‌వ్యాప్తంగా మ‌రోసారి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొనాల్సి వ‌స్తుంది. ఒక ప్రాంతీయ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే స‌త్తా భాజ‌పాకి లేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌లు ఎన్నిక‌ల ముందు ఆహ్వానించ‌ద‌గ్గ‌వి కాదు. కాబ‌ట్టి, వాటికి చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.

ఎన్నిక‌ల ముందు జ‌రుగుతున్న చివ‌రి స‌మావేశాల‌నీ అంటున్నారు. దీంతో కొన్ని కీల‌క‌మైన బిల్లుల‌ను ఈ స‌మావేశాల్లో ఆమోదింప‌జేసుకోవాల్సిన అవ‌స‌రం భాజ‌పాకి ఉంది. ట్రిపుల్ త‌లాక్ వంటి బిల్లులు భాజ‌పా ఓటు బ్యాంకును పెంచేవిగా ప‌నికొస్తాయి. ఎలా చూసుకున్నా తాజా స‌మావేశాలు స‌జావుగా నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం మోడీ స‌ర్కారుకు ఉంది. అందుకే, ఒకసారి ఈ అవిశ్వాసం అనుమ‌తించేస్తే ప‌నైపోతుంద‌న్న ధోర‌ణే భాజ‌పాలో క‌నిపిస్తోంది.

ఏరికోరి శుక్ర‌వారం నాడు చ‌ర్చ‌కు అనుమ‌తివ్వ‌డం కూడా వ్యూహాత్మ‌కంగానే చెప్పుకోవ‌చ్చు. నిజానికి, శుక్ర‌వారం స‌మ‌యం వ‌ద్ద‌నీ, వేరే రోజు చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని టీడీపీతో స‌హా ఇత‌ర ప‌క్షాలు స్పీక‌ర్ ను కోరినా ఫ‌లితం లేక‌పోయింది. శుక్ర‌వారం హాఫ్ డే మాత్ర‌మే స‌భ ఉంటుంది, ప్రైవేట్ మెంబ‌ర్ బిల్స్ ఉంటాయి. ఇత‌ర పార్టీల స‌భ్యులు కూడా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే ఆరోజు వెళ్లిపోయే ప‌రిస్థితి ఉంటుంది. తిరిగి వ‌చ్చేవారు దాదాపు త‌క్కువ‌గా ఉంటారు. కాబట్టి శుక్రవారం చర్చకు సిద్ధమయ్యారనీ అనుకోవచ్చు. అయితే, విప‌క్షాల‌న్నీ ఒక‌తాటిపైకి వచ్చే మ‌రో సంద‌ర్భం ఇది కావడంతో… భాజ‌పా వ్య‌తిరేక శ‌క్తుల‌న్నీ మ‌ద్ద‌తుగా నిలిచి, కేంద్రాన్ని నిల‌దీస్తాయ‌న్న ఆశాభావం వ్య‌క్త‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com