గోవధకు విరుగుడు ఉరిశిక్ష?

గొడ్డు మాంసం తినడం, గోవధ వంటి సున్నితమైన అంశాలచుట్టూ దేశ రాజకీయాలు గిరగిరా తిరుగుతున్నాయి. అగ్రనాయకుల దగ్గరనుంచీ వీధి నాయకులదాకా బీఫ్ తినడాన్నీ, గోవులను వధించడాన్ని సపోర్ట్ చేయడమో లేదా వ్యతిరేకించడమో అనాలోచితంగా చేసిపారేస్తున్నారు. తద్వారా తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అయితే వీరి వ్యాఖ్యలు రెండు మతాలమధ్య ఎంతగా విద్వేషాగ్ని రగిలిస్తోందో ఆలోచించడంలేదు. యుపీలోని దాద్రీకి దగ్గర్లోని బిశారా గ్రామంలో జరిగిన సంఘటనప్పటినుంచీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ – సాక్షి మహరాజ్ – గోవధ చేసిన వారిని ఊరికే వదిలిపెట్టకూడదనీ, వారికి ఉరిశిక్ష పడేలా కఠిన చట్టాన్ని తీసుకురావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడే గోవధలు, గొడ్డుమాంసం తినడాలు ఆగిపోతాయన్నది ఆయనగారి కచ్చితాభిప్రాయంలా ఉంది. ఒక్క టెర్రరిస్టుల విషయంలో తప్ప ఉరిశిక్ష అమలుచేయడం సరైనది కాదని సర్వోన్నత న్యాయస్థానమే భావిస్తుంటే ఇప్పుడు గోవధకు విరుగుడు ఉరిశిక్ష అంటూ అధికారపార్టీ ఎంపీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ మధ్యనే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ కూడా గోవధపై సంచలన వ్యాఖ్యలే చేశారు. ముస్లీంలు గొడ్డుమాంసం తినడం మానేస్తే వారు దేశంలో ఉండొచ్చన్న ఈయనగారి స్వీయతీర్పుతో రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు. అయితే సాక్షి మహరాజ్ మాత్రం ఇద్దరూ ఒకేతాను ముక్కలుకావడంతో ఈ బీజేపీ ముఖ్యమంత్రిని వెనకేసుకొస్తున్నారు. ముస్లీంలు ఇండియాలో కలసిమెలసి ఉండాలంటే వారు గొడ్డుమాంసం తినడం మానేయాలన్న వాదనలో తప్పేమీలేదంటూ హర్యానా సీఎంకు సాక్షి మహరాజ్ మద్దతు పలికారు. వీరిద్దరి పోకడ, `ఎవరేమన్న నాకేటి సిగ్గు’ అన్నట్లుంది.

ఇదంతా ఇలా ఉంటే, జమ్మూకాశ్మీర్ లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ ఈమధ్య శ్రీనగర్ లో ఆవు మాంసంతో విందు ఇచ్చారన్న ఆరోపణను ఎదుర్కున్నారు. దీంతో హిందువుల్లో మతపరమైన భావోద్వేగాలు చెలరేగాయి. అసెంబ్లీలో కూడా ఇదే పోకడ కనిపించింది. రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు దాడికిదిగడాన్ని సైతం సాక్షి మహరాజ్ సమర్ధించారు. ఇది చర్యకు ప్రతిచర్యవంటిదని చాలా తేలిగ్గా తీసిపారేశారు. `నాయకులు ప్రజలమనోభావాలు దెబ్బతినే రీతిలో మాట్లాడితే చూస్తూ ఊరుకోరు, చితక్కొడతారు. ప్రతిచర్య చాలా బలంగానే ఉంటుంది’ అని సాక్షి మహరాజ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

మనదేశ రాజకీయాల్లో బీజేపీది విలక్షణమైన ధోరణి. ఎవరుకాదన్నా దీని మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి. బీజేపీ నాయకుల్లో ఒక్క సాక్షి మహరాజ్ మాత్రమేకాదు, చాలామంది ఆర్ఎస్ఎస్ పట్ల పూర్తి విశ్వాసం ఉంది. ఆర్ఎస్ఎస్ ఒక్కటే భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించగలదని వారు విశ్వసిస్తుంటారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం వెనుకబడలేదనీ ప్రధాని నరేంద్ర మోదీ తప్పకుండా ఆ పనికూడా పూర్తిచేస్తారని బీజేపీ నేతల ప్రగాఢ విశ్వాసం. మొత్తానికి రామాలయ నిర్మాణం దగ్గర నుంచీ ఇప్పుడు గొడ్డుమాంసం దాకా అనేక అంశాలను ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ పండిపోయింది. ఇక రాలిపోవడం ఎప్పుడా అని మాత్రం విపక్షాలు చూస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com