విశాఖలో స్వరూపానంద ఆశ్రమానికి జగన్ వెళ్లారు. పోలీసులకు జనానికి చక్కలు చూపారు. వారి అవస్థలు మీడియాలో హైలెట్ అయ్యాయి. వెంటనే సీఎం జగన్ “ఆగ్రహించారు”. మరోసారి ప్రజల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. మరి జగన్ అంటే ఏటనుకున్నారు ? అని జనం అనుకున్నారు. తాజాగా జగన్ సొంత జిల్లా కడప వెళ్లారు. అక్కడేం జరిగింది ?. సొంత జిల్లా అయినా ఎవర్నీ ఇల్లు కదలనీయలేదు. మూడున్నర వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఎవరూ వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా బయటకు రానీయలేదు. ఒక్క కడపలోనే కాదు.. కర్నూల్లో ఓ పెళ్లికి వెళ్తే అక్కడా అదే పరిస్థితి. అక్కడ ఇంకా దారుణంగా కొన్ని ఇళ్లకు తాళాలేశారు పోలీసులు. అంటే… విశాఖలో పరిణామాలపై జగన్ ఆగ్రహం అంతా ఉత్తదేనన్నమాట. సీఎం జగన్ బయటకు వస్తే ప్రజలు ఇళ్లలోకి వెళ్లిపోవాల్సిందేనన్నమాట.
ఆయనకు తగ్గట్లుగానే కొత్త మంత్రులు తయారయ్యారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఎవరెవరు జిల్లాలకు వెళ్లాలో రాసిచ్చినట్లుగా ఓ స్కీమ్ ప్రకారం మంత్రులు సొంత జిల్లాలకు వెళ్తున్నారు. అక్కడ హడావుడికి ఏమాత్రం తక్కువ చేయడం లేదు. చివరికి ఉన్న మంత్రి పదవిని నిలబెట్టుకుని వచ్చిన వారికి ధూంధాం స్వాగతాలు ఏర్పాటు చేస్తున్నారు. రూ. కోట్లు ఖర్చుపెట్టి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎందుకు ఇంత హడావుడో జనానికి అర్థం కాని పరిస్థితి. వారి ర్యాలీలతో ప్రజలకూ ఇబ్బందులే. అనంతపురం జిల్లాలో మంత్రి ఉషాశ్రీచరణ్ ర్యాలీ వల్ల ఓ పాప మరణించిందన్న దుమారం రేగింది. అదేమీ లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ పోలీసులపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఎవరూ నమ్మడం లేదు.
ముఖ్యమంత్రి.. మంత్రులు ఎందుకింత అధికార దర్పం ప్రదర్శిస్తున్నారో సామాన్య జనానికి అర్థం కావడం లేదు . సీఎం ఓ వీవీఐపీ . కానీ ఆయనకు ఆ హోదా ఇచ్చింది జనం. ఆయన భద్రత ముఖ్యమే కానీ.., ఇంత అతి భద్రత ఎందుకు.. జనాల్ని టార్చర్ పెట్టేంత దర్పం చూపించడం ఎందుకో ఎవరికీ అర్థం కాని విషయం. టీడీపీ నేతలు ఈ అంశాన్ని ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న భయంతోనే అలా పోలీసు వలయంలో తిరుగుతున్నారన్న కోణంలో చెబుతున్నారు. ప్రజలు కూడా అలాగే అనుకునే పరిస్థితి వస్తుంది.