లోకేష్, పవన్, జగన్‌లు ముగ్గురూ కూడా ఇప్పుడు విద్యార్థులతో, యువకులతో ఇంటరాక్ట్ అవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. మేం యువనేతలం, కొత్త తరం రాజకీయాలకు ప్రతినిధులం అనే మెస్సేజ్ ఇవ్వాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అలాగే విద్యార్థులు, యువతరాన్ని ఆకట్టుకుంటే కుటుంబంలో ఉండే ఎక్కువ మంది ఓట్లు ప్రభావితమవుతాయని మన నాయకులకు గట్టి నమ్మకం. 2014ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణవారు తరచుగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. అది టిడిపికి బాగానే కలిసొచ్చిందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అన్నింటికీ మించి జగన్ అవినీతిపరుడు, అరాచక శక్తి అన్న ముద్రను యువత ఆలోచనల్లో బలంగా వేయడంలో రాధాకృష్ణ సక్సెస్ అయ్యాడని విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు. ఆ ప్రోగ్రాంలో చంద్రబాబు, వెంకయ్యలతో పాటు ఇంకా బోలెడుమంది టిడిపి నాయకులను భాగస్వాములను చేశాడు రాధాకృష్ణ. 2014 ఎన్నికల్లో ఓటమికి అది కూడా ఓ కారణమని నమ్మే వైఎస్ జగన్ కూడా ప్రత్యేక హోదాని అడ్డుపెట్టుకుని విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాలు పెట్టుకుంటున్నాడు. వైఎస్ జగన్‌కి నేనే సరైన పోటీ అని చాటుకోవాలని అనుక్షణం తపిస్తూ ఉండే నారా లోకేష్ కూడా అదే బాటపట్టేశాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు విద్యార్థులు, యువతరంతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అయితే ఈ ముగ్గురూ ఇంటరాక్ట్ అయ్యే విధానాలలో చాలా తేడాలున్నాయి.
ముందుగా నారా లోకేష్ గురించి మాట్లాడుకుంటే లోకేష్‌ని లీడర్‌గా ప్రమోట్ చేయడం కోసమే ఆ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నారని అందరికీ అర్థమవుతోంది. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా ముందుగా ఎవరైనా ప్రిపేర్ చేసినట్టుగా ఉంటున్నాయి. ఆ మాత్రం చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడంలో లోకేష్ తడబడుతున్నాడు. లోకేష్ తీరు అంతా కూడా రాహుల్ గాంధీ వ్యవహారంలా ఉంటోంది. రాహుల్ విషయంలో సోనియా గాంధీ చేసినట్టుగానే చంద్రబాబు కూడా లోకేష్ చుట్టూ అద్దాల గోడలు కట్టేస్తున్నాడు. లోకేష్ ఏం చేసినా అందంగా కనిపించాలి, లోకేష్ చాలా గొప్ప సమర్థుడన్న నమ్మకం పార్టీవాళ్ళతో పాటు, ప్రజలకు కూడా రావాలన్న ప్రయత్నంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి బాగానే ఉంటాయి కానీ పొరపాటున పవర్ పోతే మాత్రం ఇప్పటి రాహుల్ గాంధీలా తయారవుతుంది పరిస్థితి.
ఇక వైఎస్ జగన్‌కి చెప్పిందే చెప్పడం బాగా అలవాటయిపోతోంది. పబ్లిక్ స్పీచ్‌లలో మాట్లాడినట్టుగానే విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలలో కూడా మాట్లాడేస్తున్నాడు. తన విధానాలను, ఆలోచనలను విద్యార్థులకు చెప్పడం కంటే కూడా చంద్రబాబు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు జగన్. రిజర్వేషన్స్, మహిళల భద్రత, ఉద్యోగాలు, అవినీతి లాంటి విషయాలపై విద్యార్థులు తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కానీ ఆ విషయాలపై తన అభిప్రాయాలు, ఆలోచనలు ఏంటో ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేయడం లేదు జగన్.
పవన్ కళ్యాణ్‌కి మాత్రం ఇఫ్పటికప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలి అన్న ఆలోచనలు ఏమీ ఉన్నట్టుగా లేవు. ముందుగా ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నట్టున్నాడు పవన్. అన్ని విషయాలూ నాకు తెలుసు అనే పద్ధతిలో కాకుండా నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని, ఆ విషయాల గురించి కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నానని, అధ్యయనం చేస్తున్నానని పవన్ చెప్పడం బాగుంది. అలాగే ప్రజలు ఎదుర్కుంటున్న చాలా సమస్యలకు పవన్ దగ్గర సమాధానాలు లేవు కానీ ఆ ప్రజలను, వాళ్ళ జీవితాలను దగ్గరగా చూడాలని మాత్రం అనుకుంటున్నాడు. పార్టీ పెట్టామా? ముఖ్యమంత్రి అయిపోయామా? లాంటి ఆలోచనలతో పవన్ లేడు కాబట్టి ఈ రకమైన సమావేశాలు పవన్ పొలిటికల్ కెరీర్‌కి మంచే చేస్తాయి. క్లారిటీ తక్కువ, కన్ఫ్యూషన్స్ ఎక్కువ ఉన్న పవన్ ఆలోచనల్లో స్పష్టత రావడానికి కచ్చితంగా ఉపయోగపపడతాయి. అయితే నారాలోకేష్, జగన్‌ల ముఖాముఖి కార్యక్రమాలు మాత్రం రెగ్యులర్ రాజకీయ సభల్లాగే ఉంటున్నాయి. యవత, విద్యార్థులతో మన నాయకులు తరచుగా సమావేశమవుతూ ఉండడం మంచిదే కానీ… ఆ ఇంటరాక్షన్ ఇంకాస్త ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది. అప్పుడే ఇరువురికీ కూడా మంచిది.