హైదరాబాద్: గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం చిత్రాల దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి టాలీవుడ్‌కు, తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కంచె’ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలయింది. రెండో ప్రపంచయుద్ధకాలంనాటి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ అటు టాలీవుడ్‌నూ, ఇటు ప్రేక్షకులనూ షాక్‌కు గురిచేస్తోంది. స్టన్నింగ్ విజువల్స్‌తో ట్రైలర్ వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా కెమేరా పనితనం అద్భుతంగా ఉంది. యుద్ధ సన్నివేశాలుగానీ, ప్రకృతి అందాలుగానీ ఇంత అద్భుతంగా తెలుగుతెరపై ఇంతవరకు రాలేదని చెప్పొచ్చు. హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ ప్రజ్ఞాజైస్వాల్, విలన్ నికేతన ధీర్ పాత్రలుకూడా ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి.
రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో అభిమానుల సమక్షంలో రాజమౌళి ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంపై ఇంతవరకు ఏ విధమైన అంచనాలు లేకపోయినప్పటికీ, ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలను పెంచేవిధంగా ఉందని చెప్పొచ్చు. దీనిని చిత్రం చేరుకుంటుందో, లేదే తెలియాలంటే అక్టోబర్ 2 దాకా వేచిచూడాల్సిందే. ఆడియో ఈ నెల 12న విడుదల కాబోతోంది.