Su From So Movie review
తెలుగు360 రేటింగ్: 2.5/5
పత్రికల్లో వచ్చే వార్తలు కొన్నిసార్లు సినిమా కథలకు ముడిసరకవుతాయి. తాజాగా కన్నడలో మంచి ప్రేక్షకాదరణ పొందుతున్న ‘సు ఫ్రమ్ సో’ కథకు మూలం కూడా ఇదే. తన కూతురు పెళ్లి చూసేందుకు తల్లి ఆత్మగా వచ్చిందనే ఓ వార్తను స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు జేపీ తుమినాడ్ ఈ హారర్ కామెడీ కథకి తెరరూపం ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగులోకి తీసుకొచ్చారు. మరి ఇంతకీ ‘సు ఫ్రమ్ సో’ లో ఆత్మ ఏమిటి? అది ఎలాంటి వినోదాన్ని పంచింది?
కర్ణాటకలోని ఓ ఊరు. ఆ ఊర్లో రవన్న (షానిల్ గౌతమ్) అంటే అందరికీ భయంతో కూడిన గౌరవం. అక్కడ తన మాటే చెల్లుతుంది. పెళ్లి, చావు ఇలా ఏ కార్యమైనా రవన్నే ముందుండాలి. 40 ఏళ్లు దాటిన రవన్న స్టిల్ బ్యాచిలర్. రవన్నకు నమ్మకాలు ఎక్కువ. శ్రాద్ధ కర్మకు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. మరణించినవారు ఖచ్చితంగా ఆత్మలుగా వచ్చి తాము ప్రేమగా పెట్టిన ఆహారాన్ని స్వీకరిస్తారని అతని విశ్వాసం. గ్రామస్థులకు కూడా ఈ నమ్మకాలు బలంగానే ఉంటాయి. ఓ రోజు అదే ఊళ్లో ఉండే అశోక్ (జె.పీ. తుమినాడ్) ఓ పెళ్లి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ తప్పుడు పని చేస్తాడు. ఇద్దరు వ్యక్తులు అతడ్ని వెంబడించి పట్టుకుంటారు. అయితే అశోక్ మామూలుగా లేడని, అతనికి ఆత్మ ఆవహించిందని ఆ ఇద్దరూ గ్రహిస్తారు. తర్వాత ఏం జరిగింది? అసలు అశోక్ చేసిన తప్పుడు పని ఏమిటి? నిజంగానే అతడిని ఆత్మ ఆవహించిందా? ఈ సంగతి తెలుసుకున్న రవన్న, గ్రామస్థులు ఏం చేశారు? అనేది మిగతా కథ.
ఒక సినిమా స్క్రిప్ట్ రాయడం పర్వతాన్ని అధిరోహించడం లాంటింది. పర్వతాన్ని ఎక్కేటప్పుడు శిఖరాన్ని చూస్తే డీలా పడిపోతాం. ఇంకా అంత ఎత్తా? అనే నిరుత్సాహం ఆవహిస్తుంది. శిఖరం కాకుండా మన అడుగుపైనే ఫోకస్ చేస్తే గమ్యం సులభమౌతుంది. సినిమా స్క్రిప్ట్ కూడా అంతే. కథ మొదలెట్టినప్పుడే ఇంటర్వెల్ బ్యాంక్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ గురించి ఆలోచిస్తే స్క్రిప్ట్ పుట్టదు. మన ఫోకస్ అనుకున్న కథని రాయడంపైనే ఉండాలి. గొంగళి సీతాకోకచిలుకగా మారినట్టు ఓ ఆలోచన రాస్తూ వెళితే దానంతట అదే స్క్రిప్ట్‌గా మారుతుంది. ప్రఖ్యాత దర్శకుడు అకీరా కురొసావా సినిమా కథ గురించి చెప్పిన మాటలివి. ఈ రోజుకీ చాలా మంది దర్శక-రచయితలు తెలిసో తెలియకో ఈ స్టయిల్లోనే వర్క్ చేస్తారు. దర్శకుడు జేపీ తుమినాడ్ కూడా ఇదే తరహాలో ‘సు ఫ్రమ్ సో’ స్క్రిప్ట్‌ని రెడీ చేసుకున్నాడు. తన దగ్గర ఓ న్యూస్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ని ఎలాంటి హడావిడి చేయకుండా చాలా నింపాదిగా పాత్రలు, సన్నివేశాలు, సంఘర్షణ అల్లుకుంటూ వెళ్లాడు. ఈ ప్రయాణం కొన్ని చోట్ల నవ్విస్తుంది, ఇంకొన్ని చోట్ల భయపెడుతుంది, కొన్నిచోట్ల డీలా పడుతుంది, మరికొన్ని చోట్ల భావోద్వేగాన్ని కలిగిస్తుంది.
‘సు ఫ్రమ్ సో’ని ఆత్మల కథలా కాకుండా నమ్మకాల కథగా చెప్పడం బాగా కుదిరింది. తన కూతురు పెళ్లి చూడటానికి మరణించిన తల్లి వచ్చిందని ఓ గ్రామస్థులు నమ్మారంటే… అది ఎలాంటి ఊరు అయి ఉంటుందో? ముందుగా ఈ పాయింట్‌పై చాలా వర్క్ చేశాడు దర్శకుడు. అలాంటి నమ్మకాలు ఉన్న ఒక ఊరిని, పాత్రలను క్రియేట్ చేశాడు. తద్దినం పెట్టే సీన్లో గ్రామస్తులందరినీ ఒక చోటికి చేర్చి వాళ్లందరికీ దెయ్యాలు, ఆత్మలపై విశ్వాసం ఉందని కన్వే చేయడం బావుంది. తద్దినం, ఆ తర్వాత వచ్చే పెళ్లి సన్నివేశాలతో దాదాపు పాత్రలన్ని పరిచయం చేసి ఆ తర్వాత అసలు పాయింట్లోకి వచ్చాడు. ఎప్పుడైతే అశోక్‌ని ఆత్మ ఆవహించిందనే పాయింట్ తెరపైకి వస్తుందో అక్కడి నుంచి నవ్వులు, భయాలు రెట్టింపు అవుతాయనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో వస్తుంది. కానీ ఈ సినిమాని ఓవర్ ది బోర్డ్ తీసుకెళ్లలేదు దర్శకుడు. కామెడీ, హారర్, ఎమోషన్స్ అన్నీ సెటిల్డ్‌గానే ఉంటాయి. మరీ పగలబడి నవ్వుకునే సీన్స్ ఉండవు. అలాగని మరీ చప్పగా ఉండదు. పాత్రలు పడుతున్న భయాన్ని చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కు ఆ కామెడీ నచ్చే ఛాన్స్ ఉంది.
సెకండ్ హాఫ్‌లో అసలు పాయింట్ రివీల్ అవుతుంది. అది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పదలచుకున్న సందేశం కూడా అదే. సులోచన కోసం పక్క ఊరికి వెళ్ళడం, ఒంటరిగా అవస్థలు పడుతున్న భాను పాత్ర కథకు ఒక ఎమోషన్ తీసుకొస్తాయి. నిజానికి దర్శకుడు వేసుకున్న సెటప్‌లో కామెడీ, హారర్ ఎలివేట్ చేస్తూ గ్యాలరీని అలరించే ఛాన్స్ ఉన్నప్పటికీ తన దృష్టి అంతా కథమీదే ఉంది. ఇది సులోచన కూతురు భాను కథ. ఆ పాయింట్ వరకూ వెళ్ళడానికి దర్శకుడు ఎలాంటి తొందరపడలేదు. శిఖరం పై కాకుండా తన అడుగుపైనే దృష్టి పెట్టాడు. తను చెప్పదలచుకున్న పాయింట్ బలంగానే చెప్పాడు. మంచి క్లైమాక్స్ దొరికింది. కామెడీ పక్కన పెడితే ఒక ఎమోషనల్ ముగింపు కుదిరింది. కాకపోతే సెకండ్ హాఫ్‌ని కావాల్సినదానికంటే ఎక్కువ డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఈ సినిమాలో పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్నీ మన చుట్టూ ఉండే పాత్రలే. ఒక్కటి కూడా సినిమాటిక్‌గా ఉండదు. అదే ఇందులో బ్యూటీ. రవన్న లాంటి క్యారెక్టర్ ప్రతి ఊరులో కనిపిస్తుంది. రవన్న పాత్రలో షానిల్ గౌతమ్ ఒదిగిపోయాడు. తనకు ఇచ్చిన బిల్డప్ క్లైమాక్స్‌లో వర్క్ అయ్యింది. అశోక్ పాత్రని దర్శకుడు జేపీ తుమినాడ్ చాలా సెటిల్డ్‌గా చేశాడు. నిజానికి ఆ పాత్రని మరొక నటుడు చేసుంటే కాస్త ఓవర్ అయ్యేదేమో. ఆ క్యారెక్టర్ మీటర్ తనకి తెలుసు. అందుకే ఎక్కడా హద్దులు దాటలేదు. సులోచన కూతురు భానుని కలిశాక అశోక్ క్యారెక్టర్లో వచ్చిన మార్పు, పశ్చాత్తాపం సహజంగా ఉన్నాయి. మనసుపడిన అమ్మాయే కావచ్చు, కానీ దొంగచాటుగా ఓ అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు చూడటం ఒక దుర్మార్గమైన చర్య. అలాంటి సున్నితమైన అంశాన్ని చెంపదెబ్బ కొట్టినట్లుగా చూపించడం బావుంది. గురూజీగా రాజ్ బి శెట్టి నటన, డైలాగ్ డెలివరీ నవ్విస్తాయి. తాగుబోతు బావ క్యారెక్టర్ భలే నవ్విస్తుంది. మిగతా పాత్రలన్నీ సహజంగా కుదిరాయి.
చిన్న సినిమా అయినప్పటికీ టెక్నికల్‌గా చాలా మంచి వర్క్ కనిపిస్తుంది. ఒక ఊరుని చాలా సహజంగా చూపించారు. నిజంగా అలాంటి ఒక ఊరు ఉందనే భావన ప్రేక్షకుడిలో కలుగుతుంది. హారర్ అనేది కథలో ఉండదు. అది కేవలం కెమెరా, సౌండ్ టెక్నిక్ అనే వాదనకు ‘సు ఫ్రమ్ సో’ మరో ఉదాహరణ. ఇందులో దెయ్యం ఉందా లేదా అనేది సినిమా మొదలైన 15 నిమిషాలకే తెలిసిపోతుంది. ఆ విషయాన్ని క్లారిటీ చెప్పిన తర్వాత కూడా ప్రేక్షకుడు చాలా చోట్ల భయపడతాడు. అదీ కంప్లీట్‌గా కెమెరా, రికార్డింగ్ మ్యాజిక్. హాస్యం పండించడంలో ప్రతి భాషకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక భాషలో ఉన్న సొగసు మరో భాషకి రాదు. బహుశా కన్నడలో డైలాగ్ ఓరియంటెడ్‌గా కొన్ని ఎక్కువ నవ్వులు పండాయేమో కానీ తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి నవ్వులు మోతాదు ఒక మోస్తరు గానే ఉంది. యాక్షన్ కామెడీ పండినంతగా డైలాగ్ కామెడీ పండలేదు.
గ్రామీణ నేపధ్యంలో ఒక వెరైటీ కామెడీ హారర్ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమాని ప్రయత్నించవచ్చు. అయితే ఈ సినిమా ఇప్పటికే కన్నడలో రిలీజ్ అవ్వడంతో ముందే ‘ఓహో అద్భుతం’ అనే కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అలాంటి అంచనాలతో థియేటర్లో అడుగు పెట్టకుండా వెళ్తే టైమ్ పాస్ కి లోటు ఉండదు.
తెలుగు360 రేటింగ్: 2.5/5