ఏపీ ప్రభుత్వం పధ్నాలుగు జిల్లాల ఎస్పీలను మార్చింది. పన్నెండు జిల్లాల ఎస్పీలను అక్కడే కొనసాగించారు. ఈ బదిలీల్లో అందరి దృష్టిని ఆకర్షించేది తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడును మళ్లీ నియమించడం. కొంత కాలం కిందటి వరకూ ఆయనే తిరుపతి ఎస్పీగా ఉండేవారు. అయితే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట తర్వాత ప్రభుత్వం తక్షణ చర్యల్లో భాగంగా ఆయనను బదిలీ చేసింది. ఇటీవల ఆ తొక్కిసలాట ఘటనలో అప్పటి తిరుపతి ఎస్పీ బాధ్యత లేదని రిపోర్టు వచ్చింది. ఈ కారణంగా మళ్లీ తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడును నియమించారు.
తెలంగాణ క్యాడర్ కు చెందిన సుబ్బారాయుడు స్వస్థలం.. ఉమ్మడి చిత్తూరు జిల్లానే. డిప్యూటేషన్ మీద ఆయన ఏపీకి వచ్చారు. తిరుపతిలో పని చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఏపీకి డిప్యూటేషన్ వచ్చారు. మొదటి పోస్టింగ్ ఆయనకు తిరుపతి ఎస్పీగా ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల బదిలీ చేసినా మళ్లీ ఆయనకు అదే పోస్టింగ్ లభించింది. సుబ్బారాయుడు.. వైసీపీ నేతల అవినీతిపై జరుగుతున్న సిట్ విచారణాల్లోనూ కీలకంగా ఉన్నారు. తిరుపతిలో కఠినంగా వ్యవహరిస్తూండటంతో..ఆయనపై వైసీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తూంటారు.
ఒక సారి జగన్మోహన్ రెడ్డి కూడా సుబ్బారాయుడు పేరు పెట్టి మరీ హెచ్చరికలు జారీ చేశారు. దానికి ఎస్పీగా ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలకు తావు లేకుండా కఠినంగా వ్యవహరిస్తారన్న పేరు సుబ్బారాయుడు ఉంది. ఆయనను మళ్లీ తిరుపతి ఎస్పీగా నియమించడంతో వైసీపీ నేతలకు మళ్లీ కంగారు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
