సుభాష్ చంద్ర గార్గ్. ఈ పేరుకు బ్యూరోక్రాట్ వర్గాల్లో మంచి పేరు ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న త స్థానాల్లో పని చేసిన ఆయన తాజాగా ‘నో మినిస్టర్: నావిగేటింగ్ పవర్, పాలిటిక్స్ అండ్ బ్యూరోక్రసీ విత్ ఎ స్టీలీ రిజాల్వ్’ అనే పుస్తకం రాశారు. ఇందులో తన కెరీర్ లో వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్న చాలెంజ్‌లను వివరించారు. ఇందులో చంద్రబాబునాయుడుకు ఓ ప్రత్యేక అధ్యాయంకేటాయించారు.
సుభాష్ చంద్రగార్గ్ ఏపీలో ఎప్పుడూ పని చేయలేదు. కానీ ఆయన చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు, వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు.. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలో చంద్రబాబు తన సొంత రాష్ట్రం కోసం ఎంతగా పరితపించేవారో గార్గ్ గుర్తు చేసుకున్నారు. వివిధ ప్రాజెక్టుల కింద ఏపీకి నిధుల కోసం .. తన రక్తం పీల్చేవారని.. గార్గ్ సరదాగా వ్యాఖ్యానించారు. అనేక సమయాల్లో నిబంధనలకు విరుద్ధంగా అయినా సరే.. ఆంధ్రాకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిధులు మళ్లించాల్సి వచ్చిందన్నారు.
అప్పట్లో ప్రపంచ బ్యాంక్ అనుమతించిన ప్రాజెక్టుల్లో 40 శాతం ఏపీకే వెళ్లేలా చంద్రబాబు చేసుకున్నారు. అదేసమయంలో లో-ఇన్కమ్ రాష్ట్రాలకు ఉద్దేశించిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చౌక రుణాలను కూడా ఆంధ్రా మాత్రమే దక్కాయన్నారు. చంద్రబాబు సొంత రాష్ట్రం కోసం అత్యంత స్వార్థపూరితంగా వ్యవహరించేవారని గుర్తు చేసుకున్నారు.
“తన అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం , రాజకీయ ప్రభావంతో, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో DEA సహా సిస్టమ్‌ను మాన్యువర్ చేసి, భారత ప్రభుత్వ బడ్జెట్ , బాహ్య సహాయాలలో అధిక భాగాన్ని ఆంధ్రాకు మళ్లించారు” అని గార్గ్ పేర్కొన్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థల రుణాలను వంద శాతం గ్రాంట్‌గా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని..కానీ తాను పట్టుబడి 70 శాతానికే ఆమోదం తెలిపినా.. చంద్రబాబు ప్రధానమంత్రి స్థాయిలో ఒత్తిడి చేసి.. గ్రాంట్‌గా మార్చుకున్నారన్నారు.
చంద్రబాబు “కేంద్ర సంపదలను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచే అవకాశాన్ని పూర్తిగా అణచివేసి, ఆంధ్రాకు మాత్రమే అన్ని వనరులను తీసుకెళ్లాలనే మానియాక్ జీల్ , ఇన్సిస్టెన్స్” భయంకరమని గార్గ్ పుస్తకంలో చెప్పుకొచ్చారు. అప్పట్లో అన్ని రాష్ట్రాలకు కేంద్ర గ్రాంట్లు 2.6% మాత్రమే పెరిగినప్పుడు, ఆంధ్ర షేర్ 34% పెరిగిందంటే.. చంద్రబాబు ప్రజలు ఇచ్చిన బలాన్ని రాష్ట్రం కోసం ఎలా వాడుకున్నారో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
ఇప్పుడు కూడా కేంద్రం నుంచి వీలైనంత అధిక నిధులు పొందడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను.. ఇప్పటి ఆర్థిక శాఖ అధికారులు రిటైరైన తర్వాత ఇలాగే రాస్తారేమో ?. చంద్రబాబు రాజకీయాలు ఎలా చేసినా..రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోరని.. ఆయనకు ఆంధ్రా ముఖ్యమని.. గార్గ్ అనుభవాలు ప్రజల ముందు ఉంచుతున్నాయి.