వెండి తెరపై ఈ మధ్య రక్తం ఏరులై పారుతోంది. హింసని సరికొత్తగా డిజైన్ చేసి మరీ చూపిస్తున్నారు దర్శకులు. హీరో ఎన్ని తలకాయలు తెగ్గొడితే అంత గొప్ప. ‘హిట్ 3’ ఇదే మీటర్లో సాగిన సినిమా. ఇది వరకు వచ్చిన ‘కేజీఎఫ్’, ‘యానిమల్’, ‘మార్కో’, ‘సలార్’ సినిమాలు ఈ పద్ధతిలోనే హిట్లు కొట్టాయి. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా రక్తపాతం చిందించడానికి రెడీ అయ్యారు. సుధీర్ బాబు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడు. ఈ రోజు సుధీర్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
మెట్ల మీద కుప్పలు తెప్పలుగా పడి ఉన్న శవాలు, వాటి మధ్య షర్టు లేకుండా, చేతిలో ఆయుధంతో నడుస్తున్న హీరో. ‘బ్రోకెన్ సోల్.. ఆన్ ఏ బ్రూటల్ సెలబ్రేషన్’ అనేది క్యాప్షన్. దీన్ని బట్టి ఈ సినిమా కథేమిటో? వెండి తెరపై ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవొచ్చు. పీపుల్ మీడియా నుంచి వస్తున్న 51వ సినిమా ఇది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని ప్రకటించలేదు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈలోగా వివరాలన్నీ ఒకొక్కటిగా విడుదల చేసే అవకాశం ఉంది.
సుధీర్ బాబు ఈమధ్య వరుసగా సినిమాలు చేస్తున్నా, హిట్టు దొరకడం లేదు. తనది కాని సాఫ్ట్, ఫీల్ గుడ్ కథల్ని కూడా ఎంచుకొని కొత్తగా కనిపించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈసారి తనకు అచ్చొచ్చిన యాక్షన్ లోకి దిగాడు. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.