చిన్న సినిమాలకు కొత్త కాన్సెప్ట్‌లే శ్రీరామ రక్ష. స్టోరీ ఐడియా కొత్తగా ఉంటేనే జనం దృష్టి పడుతుంది. సుహాస్ కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో తన నుంచి వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రసన్న వదనం, జనక ఐతే గనక.. ఈ చిత్రాలు సరైన ఫలితాలను రాబట్టలేదు. ఇప్పుడు మరో కాన్సెప్ట్‌తో వస్తున్నాడు సుహాస్. అదే సీక్రెట్ ఫ్యామిలీ బిజినెస్. గోపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘హే భగవాన్’ అనే టైటిల్ పెట్టారు.
టైటిల్ గ్లింప్స్ ఈ స్టోరీ లైన్‌ను పరిచయం చేసింది. హీరో ఫ్యామిలీ ఒక బిజినెస్ చేస్తుంటుంది. గ్లింప్స్ అంతా ఆ బిజినెస్ చుట్టూనే తిరిగింది కానీ ఆ బిజినెస్ పేరు ఏమిటో ‘చెప్పను బ్రదర్’ అన్న తరహాలో టీజర్‌ని కట్ చేశారు. ఇదొక లవ్ స్టోరీ. అమ్మాయి–అబ్బాయి ఫ్యామిలీలు చేసే బిజినెస్ ఇందులో కాన్ఫ్లిక్ట్. గ్లింప్స్ బాగానే టీజ్ చేసింది. అంత సీక్రెట్‌గా నడిపే ఆ బిజినెస్ ఏమిటో తెరపై చూడాలి.