అందుకే పెట్టుబ‌డిదారులు పారిపోతున్నార‌న్న సుజ‌నా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల వ‌ల్ల పెట్టుబ‌డిదారులు పారిపోతున్న ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఆరోపించారు రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి. గ‌డ‌చిన రెండు నెల‌ల్లో అన్ని విష‌యాల్లోనూ జ‌గ‌న్ సర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను అంద‌రూ గ‌మ‌నిస్తున్నార‌నీ, ఇవి కొత్త‌గా పెట్టుబ‌డులు పెడ‌దామ‌ని వ‌స్తున్న‌వారిపై కూడా ప్ర‌భావం చూపుతాయ‌న్నారు. ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ… స్థానికుల‌కు 75 శాతం ఉద్యోగాలంటూ వైకాపా స‌ర్కారు తీర్మానించింద‌నీ, ఆచ‌ర‌ణ‌లో అదెలా సాధ్య‌మ‌నీ, ఇది రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని సుజ‌నా విమ‌ర్శించారు. రాజ్యాంగం ప్ర‌కారం ఏ పౌరుడైనా ఎక్క‌డైనా ప‌నిచేసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

స్థానికుల‌కు ఉద్యోగాలు ఇవ్వాలంటే దాని కోసం ప్ర‌త్యేకంగా స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్లు పెట్టాల‌న్నారు. స్థానిక యువ‌తలో నైపుణ్యాలు పెంచ‌డం ద్వారా అవ‌కాశాలు క‌ల్పించొచ్చు అన్నారు. అయితే, ఇది ద‌శ‌ల‌వారీ జ‌ర‌గాల్సిన కార్య‌క్ర‌మం అన్నారు. ఇలా ఠ‌క్కున జ‌రిగిపోవాల‌న్న‌ట్టుగా చేయ‌కూడ‌ద‌న్నారు. పీపీయేల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింద‌నీ, ఆ నిర్ణ‌యం తీసుకునే ముందు న్యాయప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఏవైనా వ‌స్తాయా అనేది చూసుకోవాల‌నీ, అందుకే కోర్టు దానిపై స్టే ఇచ్చింద‌న్నారు. 75 శాతం ఉద్యోగాలు అనే నిర్ణ‌యంపై కూడా ఎవ‌రో ఒక‌రు స్టే ఇచ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. కొత్త‌ ఇసుక విధానం అంటూ గంద‌ర‌గోళం సృష్టించార‌నీ, అమ‌రావ‌తి రైతుల‌కు ప్ర‌తీయేటా ఇస్తామ‌ని చెప్పిన సొమ్ము కూడా ఇవ్వ‌డం లేదనీ… ఇలా ఏ అంశంలో చూసినా ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానం మంచిది కాద‌నీ, అందుకే పెట్టుబ‌డిదారులు పారిపోయే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంద‌ని ఆరోపించారు. పోల‌వ‌రం గురించి మాట్లాడుతూ… కాంట్రాక్ట‌రు ఎవ‌ర‌నేది ఇక్క‌డ ముఖ్యం కాద‌నీ, ప‌నులు ముందుకు సాగాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్ తెస్తామ‌నీ, నిపుణుల క‌మిటీ వేసి ఈ నిర్ణ‌యానికి వ‌చ్చామ‌ని చెబుతున్న దానికి ప్రాధాన్య‌త ఉండ‌ద‌న్నారు. ఏం చెప్పినా పోల‌వ‌రం అథారిటీ చెప్పాల‌న్నారు. ప్రాజెక్టు ప‌నులు ఆపేయ‌డం స‌రికాద‌న్నారు సుజ‌నా.

స్థానికుల‌కు 75 శాతం అవ‌కాశాలంటూ జ‌గ‌న్ స‌ర్కారు తీర్మానించిన ద‌గ్గ‌ర్నుంచీ దీనిపై కొంత చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. ఏ కంపెనీలైనా వారికి నైపుణ్యాలున్న మేన్ ప‌వ‌ర్ కావాలి. వారు స్థానికులా స్థానికేత‌రులా అనేది కంపెనీల‌కు అన‌వ‌స‌రం. కానీ, కంపెనీలు పెట్ట‌డానికి వ‌చ్చేవారంతా ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని పాటిస్తే ఒక స‌మ‌స్య‌, పాటించ‌క‌పోతే మ‌రో స‌మ‌స్య అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారే అవ‌కాశం కనిపిస్తోంది. సుజ‌నా ఆరోపించిన‌ట్టుగా కంపెనీలు పారిపోతున్నాయ‌న్న‌దానికి పూర్తిగా స‌మ‌ర్థించ‌లేంగానీ, రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం వారిని ఒక్క క్ష‌ణం ఆపి, కాస్త ఆలోచించాకే నిర్ణ‌యం అనే ధోర‌ణివైపు నెట్టేదిగా ఉంద‌నొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com