పోలవరంపై “వైట్ పేపర్” కావాలంటున్న సుజనా..!

పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని… బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 71 శాతం ప్రాజెక్ట్ పూర్తయిందని చెబుతోందని.. దీనిపై నిజానిజాలేమిటో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బయట పెట్టాలన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో… మేఘా సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించే ప్రయత్నాలపై… సుజనా చౌదరి సెటైర్లు వేశారు. తూతూమంత్రంగా పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ జరిగిందన్నారు. ప్రస్తుతం మేఘాకు ఇచ్చిన టెండర్ వల్ల ప్రాజెక్ట్ నిర్మాణం మూడేళ్లు ఆలస్యం అవుతుందన.. సుమారు ఐదారువేల కోట్ల నష్టం వస్తుందని లెక్క చెప్పారు. పోలవరాన్ని కాలయాపన చేయడం వల్ల రైతులకు తీరని నష్టమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ఎంత మేర పనులు పూర్తయ్యాయి… ఇప్పుడు చేపట్టబోయో పనులు విధానాలపై.. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందేనన్నారు. ప్రాజెక్ట్‌లో అవినీతిని తగ్గించామని… ఏపీ సర్కార్ చేసుకుంటున్న ప్రచారంపైనా స్పందించారు. అవినీతి తగ్గిస్తే ఎక్కడ తగ్గించారో చెప్పాలని సవాల్ చేశారు.

జగన్‌ తీరు వల్ల దేశానికి కూడా చెడ్డపేరు వస్తోందని …ఇలా వ్యవహరిస్తే ఏపీకి పరిశ్రమలు రావన్నారు. ఇప్పటికే బ్యాంకులు ఆంధ్రప్రదేశ్‌కు రుణాలు ఇవ్వడం లేదని గుర్తు చేసారు. మతాలు, కులాలను విడదీసి పరిపాలిద్దామనుకుంటున్నారా అని ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయిందని.. ఇసుక పాలసీ తీసుకొచ్చి ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి వేదికగా జరుగుతున్న రాజకీయంపైనా…సుజనా స్పందించారు. ఇంటిని పడగొడితే సానుభూతి వస్తుందని చంద్రబాబు చూస్తున్నారని.. అద్దెకు ఉన్నప్పుడు దాన్ని ఖాళీ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చారు. భూముల విషయంలో ఏపీ సర్కార్.. టార్గెట్ చేసిందనే ప్రశ్నలకు.. ఆరోపణలు చేశారు, నిరూపించాలని చెప్పాన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలను సుజనా చౌదరి యాక్టివ్ గా విమర్శిస్తున్నారు. ఇతర బీజేపీ నేతల విమర్శలకు.. సుజనా చౌదరి విమర్శలకు కొంత తేడా ఉంది. అయితే.. సుజనా చౌదరి .. బీజేపీ ఎంపీ హోదాలో మాట్లాడుతున్నారా లేక.. సొంతంగా ప్రెస్‌మీట్లు పెట్టి… తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారా.. అన్నదానిపై క్లారిటీ లేదు. కొన్ని రోజుల కిందట.. బీజేపీ నేతలంతా సమావేశమై.. ప్రతీ అంశంపై.. ఒకే వాదన వినిపించాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో.. రివర్స్ టెండరింగ్ పై బీజేపీ నేతలు ఇంత వరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. సుజనానే స్పందించారు. కాబట్టి.. బీజేపీ అధికారిక విధానం ఇదే అనుకోవాలేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com