‘రంగస్థలం’ తరవాత రామ్ చరణ్ – సుకుమార్ కలిసి పని చేస్తున్నారంటే, అందులోనూ ‘పుష్ప’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరవాత అంటే.. ఆ ప్రాజెక్ట్ పై ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పెద్ది’ తరవాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఇదే. సుకుమార్ ప్రస్తుతం చరణ్ కథపైనే ఫోకస్ పెట్టారు. ఇటీవల తన టీమ్ తో కలిసి బ్యాంకాక్ వెళ్లారు సుకుమార్. ఇప్పుడు తిరిగి వచ్చారు. కథపై ఇప్పుడు ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. చరణ్‌తో సినిమా ఓకే అయ్యింది కానీ, ఎలాంటి సినిమా, ఏ జోనర్..? అనే విషయాలపై సుకుమార్ కు ఇప్పటి వరకూ ఓ ఐడియా లేదట. బ్యాంకాక్ వెళ్లాక.. అక్కడ కథపై ఓ క్లారిటీ వచ్చిందని, త్వరలోనే చరణ్ ని కలిసి కథ గురించి చర్చిస్తారని తెలుస్తోంది.
‘రంగస్థలం’ ఓ పొలిటికల్ యాక్షన్ డ్రామా. దానికంటే భిన్నంగా ఈసారి చరణ్ కోసం కథ రెడీ చేసినట్టు సమాచారం. చరణ్‌తో ఓ మంచి లవ్ స్టోరీ చేయాలని సుకుమార్ కు ఉంది. కాకపోతే… మారిపోయిన పరిస్థితులు, ఇమేజ్ వల్ల, పుష్ప వల్ల తన సినిమాలకు కొత్తగా ఏర్పడిన మార్కెట్ వల్ల, ఈసారి కూడా చరణ్ పై యాక్షన్ డ్రామానే రూపొందించే ఛాన్స్ వుంది. ఇంత కాలం చరణ్ తో ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయంలో సుకుమార్ తర్జన భర్జనలు పడ్డారని, బ్యాంకాక్ ట్రిప్ తో దానికి తెర పడిందని, ఇకపై అన్ని పనులు చక చక మొదలైపోతాయని తెలుస్తోంది. పెద్ది 2026 మార్చిలో విడుదల అవుతుంది. ఆ తరవాతే సుకుమార్ సినిమా మొదలవుతుంది. ఈలోగా సుకుమార్ చేతిలో కూడా చాలా సమయం ఉంటుంది. ఓ వైపు చరణ్ సినిమా కథలు, వాటికి సంబంధించిన పనులు చక్కబెడుతూనే తన ప్రొడక్షన్ లో వచ్చే సినిమాలపై కూడా సుకుమార్ దృష్టి పెట్టారని సమాచారం. సుకుమార్ రైటింట్స్ లో ఒకేసారి రెండు మూడు సినిమాలు బయటకు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి సైతం సుకుమార్ సమయం కేటాయిస్తున్నారు.