ఈమధ్య సుమంత్ సినిమాలు చేయడం లేదు. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. బ్రేక్ తరవాత ఈటీవీ విన్ నుంచి వస్తున్న ‘అనగనగా’లో నటించారు సుమంత్. ఈనెల 15న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే కొన్ని రోజులుగా సుమంత్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మృణాల్ టాకూర్, సుమంత్ ఉన్న ఫొటో అది. ఆ ఫొటోలో వారిద్దర్నీ చూసి ‘ఏంటి కొత్తగా వీరి మధ్య ఏం నడుస్తోంది’ అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. సుమంత్ ప్రస్తుతం సోలోగానే ఉన్నారు. ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఫొటోతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది.
ఈ విషయమై తెలుగు 360 సుమంత్ ని ఆరా తీసింది. సుమంత్ ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మృణాల్ తో ఫొటో వెనుక కథేమిటి అని అడిగితే… సుమంత్ నేరుగా సమాధానం చెప్పలేదు. ”నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. అందులో నా గురించి ఏం మాట్లాడుకొంటారో నేనసలు పట్టించుకోను. మీరు ఇప్పుడు ఏ ఫొటో గురించి అడుగుతున్నారో కూడా నాకు తెలీదు” అంటూ సమాధానాన్ని దాట వేశారు. అయితే తాను ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నానని, సింగిల్ గా హ్యాపీగా బతికేస్తున్నానని పరోక్షంగా రెండో పెళ్లి ఉద్దేశ్యం లేదన్నట్టే మాట్లాడారు. సుమంత్ వయసు ఇప్పుడు 50 ఏళ్లు. తాత నాగేశ్వరరావు నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. వాటిని ఆయన జాగ్రత్తగా కాపాడుకొంటూ వస్తున్నారు. సినిమా నిర్మాణం వైపు కూడా ఆయన దృష్టి సారించడం లేదు. ”నాకు సినిమాలు తీసే ఉద్దేశం లేదు. నాకున్న ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకొంటే చాలు. నా వ్యాపకాలు నాకున్నాయి. సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు గుర్తు పెట్టుకొంటారు, లేదంటే లేదన్న భయం కూడా నాకు లేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాలే నేను చేస్తున్నా” అని చెప్పుకొచ్చారు సుమంత్.