ఫస్ట్ లుక్ ప్రధాన ఉద్దేశ్యం… ప్రేక్షకులలో ఉత్యాహం, ఉత్యుకత కలిగించడం. ఈ సినిమాలో ఏదో వుంది అనేలా ఆసక్తి కలిగించడం. ఐతే కొన్ని ఫస్ట్ లుక్కులు… గుండెల్లో కలుక్కు మనేలా చేస్తుంటాయి. ఇదేం ఫస్ట్ లుక్కో అని భయపెడతాయి. అలాంటి వాటిలో నరుడా.. డోనరుడా… లుక్ కూడా తప్పకుండా స్థానం సంపాదించుకుంటుంది. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన విక్కి డోనార్ సినిమా కి ఇది రీమేక్. విజయాలకు మొహం వాచిపోయిన సుమంత్ హీరో. మల్లిక్ రామ్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ రోజే బయటకి వచ్చింది. వీర్య కణం పై వీరుడిలా సుమంత్ సవారి చేస్తున్నట్టు వున్న స్టిల్ అది. కాన్సెప్ట్ ప్రకారం ఈ లుక్ 100 శాతం ఓకే. కానీ చూసేవాళ్ళకి కాస్త ఇబ్బందిగా వుంది. ఫామిలీ లేడీస్ కి అయితే మరీనూ.
టైటిల్ దగ్గరే తమ సృజనాత్మకత బయట పెట్టాలని చిత్ర బృందం తెగ కష్టపడినట్టు అర్ధం అవుతొంది. అందుకే డోనర్ అనే విషయం తెలిసేలా టైటిల్ సృష్టించారు. పలకడానికి కాస్త ఇబ్బంది వుంది. ఫస్ట్ లుక్ అయితే చూడడానికే ఇబ్బంది కలిగిస్తోంది. ఫ్యామిలీస్ థియేటర్ లకు దూరం ఐపోతున్న తరుణమిది. కేవలం యూత్ వస్తే చాలు.. వాళ్ళ కోసమే ఈ సినిమా అనుకుంటే పర్వాలేదు. కానీ ఇలాంటి టైటిళ్లతో.. పోస్టర్లతో పబ్లిసిటీ చేసి… ఫామిలీ ఆడియన్స్ థియేటర్లకు రాలేదంటే ఆ తప్పు దర్శక నిర్మాతలదే అవుతుంది.