బీహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ భయం నుంచి రక్షణ కోసం సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం, ఆయనకు తక్షణ అరెస్ట్ నుండి మధ్యంతర ఉపశమనం ఇస్తూనే, కచ్చితంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
మార్చి 5 నుండి మార్చి 9 మధ్య విచారణాధికారి ముందు హాజరై వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశంతో ఆయన ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో తదుపరి అరెస్టులు లేదా చట్టపరమైన చర్యలు ఉండే అవకాశం ఉంది. 2021లో అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సీఐడీలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న సునీల్ నాయక్ సుమోటోగా దేశద్రోహం కేసు పెట్టి అరెస్టు చేశారు. మీడియాలో మాట్లాడుతున్నారన్న కారణాన్ని చూపించారు.
అరెస్టు చేసిన తర్వాత తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారని రఘురామ ఆరోపించారు. 2024లో ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత, గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సునీల్ నాయక్ తో పాటు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు వంటి వారిపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసులు నమోదయ్యాయి.
పలుమార్లు విచారణకు పిలిచినా రాకపోయే సరికి బీహార్ ఫైర్ సర్వీసెస్ ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసు బృందం పాట్నాకు వెళ్లింది. ఆయన నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, స్థానిక కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ఇవ్వడానికి నిరాకరించింది. అంతరాష్ట్ర అరెస్టులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించలేదని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పాట్నా కోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలోనే బీహార్ ప్రభుత్వం తమ రాష్ట్ర పోలీసులకు రక్షణ కల్పిస్తూ కొత్త చట్టపరమైన ఉత్తర్వులు జారీ చేసింది.
