అనర్హతా పిటిషన్లపై వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. సుప్రీంకోర్టు నేరుగా అనర్హతా వేటు వేయాలన్న విజ్ఞాపనలను తోసి పుచ్చింది.
స్పీకర్ అనర్హతా వేటు వేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించలేదు. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అంటే స్పీకర్ మూడు నెలల్లో ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారారన్న దానికి ఆధారాలు లేవని చెప్పి తిరస్కరించవచ్చు. అది కూడా నిర్ణయం తీసుకోవడమే అవుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్వచ్చందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం లేదా విప్ ను ధిక్కరించడం ద్వారా అనర్హతా వేటు పడుతుంది. అది కూడా స్పీకర్ మాత్రమే ఆ అనర్హతపై నిర్ణయం తీసుకోగలరు. దీనికి టైం ఫ్రేం లేదు.
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారామని అంగీకరించడం లేదు. అధికారికంగా వారు పార్టీ మారలేదు. కానీ దానం నాగేందర్ మాత్రం.. కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. అందుకే దానం ఒక్కరితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.