తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని మూడు నెలల గడువు సుప్రీంకోర్టు పెట్టింది. ఆ గడువు నేటితో పూర్తి అయింది. కానీ ఇప్పటికి విచారణలు పూర్తి కాలేదని.. మరో ఎనిమిది వారాల గడువు కావాలని స్పీకర్ తరపున సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అంశంపై విచారణ జరగాల్సి ఉంది.
పది మందిని ఇప్పటి వరకూ స్పీకర్ విచారణ చేయలేదు. క్రాస్ ఎగ్జామినేషన్.. ఇతర పద్దతుల ప్రకారం నలుగుర్ని మాత్రమే విచారించారు. మరో ఆరుగురి వాదన వినాల్సి ఉంది. సమయం పడుతుంది కాబట్టి సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరారు. పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది తాము పార్టీ మారలేదని వాదిస్తున్నారు. మిగిలిన ఇద్దరు ఏమీ చెప్పడం లేదు. వారు వివరణ కూడా ఇవ్వడం లేదు.
స్పీకర్ చివరికి ఎనిమిది మంది విషయంలో పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవన్న నిర్ణయం తీసుకున్నా.. దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం ఏం చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. స్పీకర్ ఇలా వాయిదాలు అడుగుతూ టైం పాస్ చేస్తే.. సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై తదుపరి స్పీకర్ కార్యచరణ ఉండే అవకాశం ఉంది.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                               
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                