మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. ట్రయల్ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే కొనసాగించాలని సూచిచింది. దర్యాప్తును నెల రోజుల్లోనే పూర్తి చేయాలన్న కాలపరిమితిని సవరించి, సాధ్యమైనంత త్వరగా ముగించాలని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఎవరినైనా విచారణకు పిలవాల్సి వస్తే సిబిఐకి ఎటువంటి అడ్డంకులు లేవని, చట్టప్రకారం దర్యాప్తును యథాతథంగా కొనసాగించవచ్చని న్యాయస్థానం తెలిపింది. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ప్రయోజనం లేదని.. తదుపరి దర్యాప్తునకు ఆంక్షలు వద్దని సునీత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కేవలం ఇద్దరు వ్యక్తుల పాత్రపైనే దర్యాప్తునకు పరిమితం చేస్తూ ఇచ్చిన తీర్పును సరి కాదని సునీత తరపు లాయర్ వాదించారు. రూ. 4 కోట్ల మనీ ట్రయల్ , నిందితుల కాల్ డేటా రికార్డుల సేకరణ వంటి అంశాల్లో దర్యాప్తు అసంపూర్తిగా ఉందని, తాము కోరని అంశాలను పరిగణనలోకి తీసుకొని ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువరించిందని వాదనలు వినిపించారు.
అయితే సుప్రీంకోర్టు.. సీబీఐ కోర్టు ఉత్తర్వులనే కొనసాగించాలని సూచించింది. దీంతో సీబీఐ తదుపరి దర్యాప్తును ప్రారంభించనుంది. ప్రత్యేకంగా గడువు పెట్టకపోవడంతో ఎప్పుడు ప్రారంభిస్తుందో.. ఎప్పటికి ముగిస్తుందో చెప్పడం కష్టమే. సీబీఐ కోర్టు ఇచ్చిన గడువు నెల కూడా ఎప్పుడో పూర్తయింది. ఇప్పుడు గడువు లేకపోవడంతో కేసు మరింత కాలం సాగనుంది.


