ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన మరో మూడు పిటిషన్లపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సూచించింది. స్పీకర్ కు చివరి అవకాశం ఇస్తున్నామని .. ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తంచేసింది. నిర్ణయం తీసుకోకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని గుర్తు చేసింది.
రెండు వారాల్లోగా తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే నాలుగు వారాల సమయం కావాలని స్పీకర్ తరపు లాయర్లు కోరారు. ఏడుగురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకున్నారని మరో ముగ్గురివి మాత్రమే పెండింగ్ ఉన్నాయని స్పీకర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే తదుపరి ముగ్గురు ఎమ్మెల్యేలపై విచారణలో పురోగతి చూపిస్తే తదుపరి నాలుగు వారాల సమయం ఇస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
దానం నాగేందర్, సంజయ్ , కడియం శ్రీహరిల విషయంలో మాత్రం స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారారు అన్నదానికి ఆధారాల్లేనందున అనర్హతా పిటిషన్లు కొట్టేశారు. ఏ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ జరిపే అవకాశం లేదు. స్పీకర్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే బీఆర్ఎస్ వేరే పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి,సంజయ్ విషయంలో పార్టీ మారలేదని పిటిషన్లు తిరస్కరించినా ఒక్క దానం విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది.
