హైదరాబాద్: అక్రమ ఆస్తులకేసునుంచి బయటపడి తిరిగి అధికారాన్ని చేపట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మళ్ళీ చిక్కులు మొదలయ్యాయి. ఆ కేసులో జయను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా పేర్కొనటాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం చేసిన అప్పీల్‌పై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఇవాళ ఆమెకు నోటీస్ జారీ చేసింది. మరోవైపు ఇదే కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన డీఎంకే నేత అన్బళగన్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికికూడా సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఎనిమిది వారాలలోగా జవాబివ్వాలని ఆదేశించింది.
పరిమితికి మించిన ఆస్తులు కలిగిఉన్నారన్న అభియోగంపై బెంగళూరు కోర్టు ఈ కేసులో జయకు నాలుగేళ్ళ జైలుశిక్ష, రు.100 కోట్ల జరిమానా విధించింది. దాంతో ఎమ్మెల్యే పదవిని, ముఖ్యమంత్రి పదవిని జయ కోల్పోయారు. అయితే గత మే 11న కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. జయ మళ్ళీ అధికారాన్ని చేపట్టి, ఆర్‌కే నగర్ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.