ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. సిట్ విచారణ వేగవంతం కావడంతో పాత విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా అప్పట్లో నిందితులకు మద్దతుగా నిలబడిన పోలీసులకూ షాక్ ట్రీట్మెంట్ తప్పనిసరిగా కనిపిస్తోంది.
అప్పట్లో కాకినాడ ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబు , డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి విచారణాధికారులుగా వ్యవహరించారు. ఘర్షణ సమయంలో అనంతబాబు తోయడం వల్లనే సుబ్రహ్మణ్యం కిందపడి చనిపోయాడని అప్పట్లో ఎస్పీ ప్రకటించారు. అయితే, నిందితుడికి అనుకూలంగా సెక్షన్లు మార్చారని, సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా పోలీసులు నిందితుడితో కుమ్మక్కయ్యారు అని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో, సిట్ అధికారులు అప్పటి ఎస్పీ, డీఎస్పీలను విచారించే అవకాశం ఉంది.
సిట్ దర్యాప్తులో అప్పటి పోలీసు అధికారులు నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా కావాలనే ఛార్జిషీట్ దాఖలు చేయడంలో జాప్యం చేశారనే కోణంలో ఆధారాలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నవంబర్ 2026 లోపు విచారణ పూర్తి చేయాల్సి ఉండటంతో, సిట్ అధికారులు ఏ చిన్న ఆధారాన్ని వదలడం లేదు. అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును తప్పుదోవ పట్టించినట్లు తేలితే, ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ బాబుతో పాటు ఇతర అధికారులు కూడా చట్టపరమైన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
మరో వైపు అనంతబాబు తన భార్యతో సహా ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతబాబు బెయిల్ పై ఉన్నందున మళ్లీ అరెస్టు చేయరు. కానీ ఆయన భార్యను అరెస్టు చేసే అవకాశం ఉంది. అదుకే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హత్య జరిగిన సమయంలో ఆమె కూడా కారులోనే ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా సిట్ ఆధారాలు సేకరించడంతో ఆమె అప్రమత్తమయ్యారు. బెయిల్ వచ్చే వరకు సిట్ అధికారులకు దొరకకుండా ఉండేందుకు ఆమె పరారీలో ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు ఇంత సీరియస్ గా తీసుకున్న తర్వాత బెయిల్ రావడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
