కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేయడమే కాదు.. సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ పని చేయడం ప్రారంభించింది కూడా. అయితే కోర్టు చేసిన వ్యాఖ్యలు విజయ్ కు వ్యతిరేకంగా ఉండటంతో దర్యాప్తు కూడా ప్రభావితం అవుతుందన్న అంచనాలతో టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఇప్పుడు సీబీఐ దర్యాప్తును సాధించింది. అదే సమయంలో సీబీఐ దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
అయితే ఇది విజయకు ఊరట అని రాజకీయవర్గాలు మాత్రం చెప్పలేకపోతున్నాయి. ఎందుకంటే సీబీఐ దర్యాప్తు అంటే.. బీజేపీ గుప్పిట్లోకి విజయ్ వెళ్లడమేనని అంటున్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయిస్తే.. అందులో ఏమైనా విజయ్ కు వ్యతిరేకంగా వస్తే .. ఆయనపై కుట్ర చేస్తున్నారన్న ధీయరీని ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నించవచ్చు. అదే సీబీఐ అయితే ఆ అవకాశం ఉండదు.
అన్నాడీఎంకే,బీజేపీ కూటమిలోకి విజయ్ ను తీసుకు రావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ కూడా ఇందుకు ఆసక్తిగా ఉంది. ఇలాంటి సమయంలో విజయ్ జుట్టు బీజేపీ చేతుల్లోకి వెళ్లేందుకు సీబీఐ దర్యాప్తు ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. విజయ్ ఓ రకంగా ఈ వివాదాన్ని తమిళనాడు స్థాయిలోనే తేల్చుకోకుండా.. సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడం వల్ల ఆయనకు మరిన్ని చిక్కులు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.