సుమారు ఒకటిన్నర దశాబ్దాలపాటు సుదీర్గంగా సాగిన న్యాయ విచారణ తరువాత 1993 ముంబై ప్రేలుళ్ళ కేసులో యాకుబ్ మీమన్ని దోషిగా నిర్ధారించి ప్రత్యేక కోర్టు మరణ శిక్ష ఖరారు చేసింది. సుప్రీం కోర్టు కూడా దానిని ఖరారు చేసింది. మరణశిక్షపడిన ఏ ఖైదీకయినా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకొనే అవకాశం కల్పిస్తారు. యాకుబ్ మీమన్ చాలా హేయమయిన నేరానికి పాల్పడినా అతనికి కూడా ఆ చిట్టచివరి అవకాశం కల్పించారు. కానీ రాష్ట్రపతి అతనికి క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించడంతో ఈనెల 30వ తేదీన అతనిని ఉరి తీయాలని నిర్ణయించారు. కానీ అప్పటి నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం, బాధ కలుగుతున్నాయి.
అతనికి మరణశిక్ష వేయడం చాలా అన్యాయమని కొందరు వాదించడం మొదలుపెట్టారు. అంటే సుమారు రెండు దశాబ్దాలపాటు సాగిన న్యాయవిచారణ అంతా వృధా… మనం ఏర్పాటు చేసుకొన్న రాజ్యాంగ వ్యవస్థలు, విధానాలు అన్నీ కూడా పనికిరానివేనని వారి అభిప్రాయంలా ఉంది. సుప్రీం కోర్టు తీర్పుని, రాష్ట్రపతి విచక్షణా జ్ఞానాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారనుకోవలసి ఉంటుంది.
సాధారణంగా రాష్ట్రపతి క్షమాభిక్షకు నిరాకరించిన తరువాత ఇక దానిని ఎవరూ కూడా ప్రశ్నించరాదనే సంప్రదాయం మన దేశంలో పాటిస్తున్నాము. కానీ రాజీవ్ గాంధీ హంతకులకు రాష్ట్రపతి క్షమాభిక్షకు నిరాకరించిన తరువాత తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దానిపై నిరసనలు తెలపడం, అసెంబ్లీలో మరణశిక్షను అమలు చేయరాదని తీర్మానం చేయడం, మద్రాస్ హైకోర్టు మరణశిక్షపై స్టే ఇవ్వడం వంటి పరిణామాలతో మనం ఏర్పాటు చేసుకొన్న నియమనిబంధనలను మనమే ఉల్లంఘించుకొన్నట్లయింది. సుప్రీం కోర్టు తీర్పును, రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా పరిహసించినట్లయింది. ఇప్పుడు అదే కారణంగా యాకుబ్ మీమన్ కి విదించిన మరణశిక్షను కూడా నిలిపివేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. తమ వాదనలకు బలం చేకూరేందుకు కొందరు యాకుబ్ మరణశిక్షకు మతం రంగు కూడా పులుముతున్నారు.
తన భర్త మరణ శిక్షపై స్టే మంజూరు చేసి, మానవతా దృక్పధంతో దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చమని అతని భార్య సుప్రీం కోర్టులో పిటిషను పెట్టుకొన్నారు. ఒక భార్యగా ఆమె ఆవేదనని అర్ధం చేసుకోవచ్చును. ఆమె ఆవిధంగా కోరడంలో అనుచితం లేదు. అందుకే సుప్రీంకోర్టు కూడా మానవతా దృక్పధంతో ఆమె పిటిషన్ని మళ్ళీ విచారణకు స్వీకరించింది. దానిని విచారించిన ఇద్దరు న్యాయమూర్తులలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈకేసును మరొక త్రిసభ్య బెంచీకి బదలాయించారు. ఒకవేళ వారు కూడా ఆ మరణశిక్షను ఖరారు చేస్తేనే దానిని అమలు చేస్తారు. లేకుంటే మళ్ళీ అతనికి పునర్జన్మ లభించినట్లే! ఇంతటి ఉదార అవకాశాలు కేవలం భారతదేశంలో మాత్రమే ఉంటాయి. కానీ ఆ విషయం మరిచిపోయి కొందరు మన న్యాయవ్యవస్థల తీర్పులని, రాజ్యాంగాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ సదరు వ్యక్తి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వందల మంది గురించి కానీ, రోడ్డునపడ్డ వారి కుటుంబాల గురించి గానీ వారికి ఎటువంటి బాధ, సానుభూతి లేకపోవడమే చాలా విస్మయం కలిగిస్తోంది.