`ఐ యామ్ కలాం’ ఇప్పుడోసారి చూడండి

ఐదేళ్ల కిందట విడుదలైన `i am kalam’ అనే హిందీ చిత్రాన్ని ఇప్పుడందరూ ఓసారి చూడాలి. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, మహాదార్శినికుడైన డాక్టర్ ఎపీజె అబ్దుల్ కలాంకు నిజమైన నివాళి అర్పించాలనుకునేవారంతా ఈ సినిమా మళ్ళీమళ్ళీ చూడాల్సిందే. కలాం మరణవార్త వినగానే దేశంయావత్తూ కలతచెందింది. ప్రముఖులు నివాళిలర్పించారు. కలాం గురించి నాలుగు మాటలు మాట్లాడారు. సరే, మరి చిన్నారుల సంగతేమిటీ, వారంతా తమ నివాళిని సరైన రీతిలో అందించాలంటే ఐయామ్ కలాం సినిమా చూడాలని ఆ చిత్ర దర్శకుడు నిలా మాధబ్ పాండా అంటున్నారు.తన హీరో (కలాం) దూరమవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు.

నేటి చిన్నారులకు అబ్దుల్ కలాం ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అందుకే ఆయన చిన్నారుల మనసుల్లో స్థిరంగా ఉంటారు. చదువుకునే ఆర్థిక స్థోమతలేని చిన్నపిల్లల్లో పెద్దపెద్ద కలలుంటాయి. వాటిని సాకారం చేయడంలో పెద్దలు కొద్దిపాటి సహకారం ఇస్తే చాలు. ప్రతి ఒక్కరూ కలాంగా మారుతారు. ప్రతి భారతీయ చిన్నారిలో కలాం ఉంటారన్న సందేశంతో ఈ సినిమా తీశామని దర్శకుడు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని 2010లో కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. మరుసటి ఏడాది భారతీయ థియేటర్లలో విడుదలచేశారు.

చిత్రకథ అంతా 12ఏళ్ల ఛోటు అనే తెలివైన పేద పిల్లాడి చుట్టూ తిరుగుతుంది. రాజస్థాన్ నేపథ్యంలో కథసాగుతుంది. పేదరికం భరించలేక తల్లి ఈ పిల్లాడిని రోడ్డుపక్కన ఉండే ఫుడ్ స్టాల్ (దాబా) ఓనర్ దగ్గర పనికి కుదురుస్తుంది. తెలివైన ఈ పిల్లాడు తన యజమానిని మెప్పిస్తుంటాడు. ఒక రోజున అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గణతంత్రదినోత్సవవేడుకల్లో పాల్గొన్న కార్యక్రమాన్ని టివీలో చూస్తూ ఛోటు స్ఫూర్తి చెందుతాడు. అప్పటి నుంచి తానుకూడా కలాం అంతటివాడు కావాలనుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే తనపేరు కలాం అని మార్చేసుకుంటాడు. చివరకు తన కలలు ఎలా పండించుకున్నాడు, ఏ విధంగా స్కూల్ కి వెళ్లగలిగాడన్నది మిగతా కథ.

అయామ్ కలాం చిత్రం అనేక అవార్డులు రివార్డ్ లు అందుకుంది. 17వ అంతర్జాతీయ బాలల ఫిల్మ్ ఫెస్టివల్ లో అత్యుత్తమ స్కీన్ ప్లే అవార్డు దక్కించుకుంది. 2011లో జాతీయ ఫిల్మ్ ఉత్తమ బాలనటుడి అవార్డును హర్ష్ మాయర్ అందుకున్నాడు. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ హిందీ చిత్రం నామినేట్ అయింది. అప్పట్లో ఈ చిత్రం గురించి ప్రశంసిస్తూ వివిధ పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి. అబ్దుల్ కలాం అప్పట్లో ఢిల్లీలోని తన నివాసంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసి చిత్రబృందాన్ని ప్రశంసించారు.

చక్కటి కథనంతో నడుస్తుంది ఈ సినిమా. ఏదో బాలల చిత్రమని తీసిపారేయకూడదు. తప్పకుండా ఇంటిల్లిపాది ఈసినిమా చూడాల్సిందే. ఐదేళ్ల క్రితం తీసిన ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నెట్ లో లభ్యమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ సినిమా చూడండి, మీ పిల్లలకు చూపించండి. వారి కలలు నిజం చేయడానికి చేతనైన సాయం చేయండి. ఈ సినిమాను ఇప్పుడు చూడటమే అబ్దుల్ కలాంకు మనమిచ్చే నిజమైన నివాళి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com