ప్రజాస్వామ్య భారతంలో ఎప్పుడూ లేని విధంగా తన అధికారాలకు సుప్రీంకోర్టు విధించిన పరిమితులపై వివరణ కోరుతూ రాష్ట్రపతి లేఖ రాశారు. ఈ లేఖ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల గురించి పక్కన పెడితే భారత ప్రజాస్వామ్యానికి పునాదుల్లాంటి రెండు వ్యవస్థల మధ్య ఏర్పడిన ఈ దూరం మాత్రం దేశానికి మంచిది కాదు.
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి సంప్రదాయాలను మరిచి రాజకీయాలు చేయాలనుకోవడంతోనే అసలు సమస్య ప్రారంభమయింది. కేంద్రంలో అధికారంలో లేని పార్టీలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లు రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు. అది ఇప్పుడు మరింత దిగజారింది. ప్రజాప్రభుత్వం చేసిన చట్టాలను గవర్నర్ ఆపేశారు. ఆపినంత కాలం ఆపి తర్వాత రాష్ట్రపతికి పంపి.. సమస్యను మరింత జఠిలం చేశారు. చివరికి ఈ అంశంపై సుప్రీంకోర్టు.. మూడు నెలల్లో గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పింది.
రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకు ఇలా గడువు నిర్ణయించే అధికారం లేదనేది ప్రధాన వాదన. రాష్ట్రపతి కూడా ఇదే అంశాన్ని వివరిస్తూ మొత్తం పధ్నాలుగు ప్రశ్నలతో సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ.. తన తీర్పును సవరించుకుంటే.. రాజ్యాంగాన్ని అతిక్రమించి తీర్పు ఇచ్చినట్లుగా అంగీకరించినట్లు అవుతుంది. సమర్థించుకుంటూ రాజ్యాంగ అధికారాలను రాష్ట్రపతికి వివరిస్తే.. సమస్య మరింత పీటముడి పడుతుంది.
ఈ వివాదంపై రాజ్యాంగ నిపుణులు, రాజకీయ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక్క సారి ఇలాంటి వివాదం వస్తే పరిష్కరించడం అంత సులువు కాదు. పరిష్కరించకపోతే ప్రజాస్వామ్యంలో అతి పెద్ద సందేహం అలాగే ఉండిపోతుంది. అది డెమెక్రసీకి మంచిది కాదు. ఈ వివాదం త్వరగా సమసిపోవాలని కోరుకుందాం.