‘వారణాసి’ విడుదలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచే ఈ సినిమాకు కావల్సినదానికంటే ఎక్కువే బజ్ వచ్చింది. గ్లింప్స్ విడుదల కోసం ఓ భారీ ఈవెంట్ నిర్వహించడం, మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నాడని, ఈ కథలో రామాయణం ఓ భాగమైందని చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది. రాముడిగా మహేష్, కుంభకర్ణుడిగా ఫృథ్వీరాజ్ సుకుమారన్ ఫిక్స్ అయిపోయారు. మరి హనుమంతుడు ఎవరన్నది ఆసక్తికరం. ఈ కథలో హనుమంతుడి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ చిక్కుముడి వీడింది. ‘వారణాసి’లో హనుమంతుడిగా.. మాధవన్ దాదాపుగా ఖాయమైపోయారు. ఈయనపై ఇది వరకే కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. మాధవన్ చేస్తోంది సామాన్యమైన పాత్ర కాదని, ఆ పాత్రలో హనుమంతుడి ఛాయలు ఉంటాయని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇటీవల ప్రియాంక చోప్రా, ఫృథ్వీరాజ్ సుకుమారన్ లుక్స్ విడుదల చేస్తున్నప్పుడే హనుమంతుడిగా మాధవన్ ని కూడా పరిచయం చేద్దామనుకొన్నారు. కానీ.. ఆ ఎందుకో మాధవన్ లుక్ బయటకు రాలేదు.
ఈ సినిమాలో ఇంకొన్ని సర్ప్రైజ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. అవేమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మహేష్ తండ్రి పాత్రలోనూ ఓ ప్రముఖ నటుడు కనిపించబోతున్నాడు. ఇది వరకు ఆ పాత్ర కోసం నానా పటేకర్ పేరు వార్తల్లోకి వచ్చింది. అయితే ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారని సమాచారం. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి. ప్రియాంకా చోప్రా కథానాయిక పాత్రధారే. కాకపోతే.. మరో హీరోయిన్ కూడా ఉండే ఛాన్సుంది. ఈసారి ఓ విదేశీ కథానాయికని ఎంచుకొనే అవకాశం కనిపిస్తోంది.