సూర్యాపేట జిల్లా కేంద్రం ప్రస్తుతం తెలంగాణలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఒకటిగా నిలుస్తోంది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై కీలకమైన ప్రదేశంలో ఉండటం ఈ పట్టణానికి అతిపెద్ద వరంగా మారింది. రెండు మెట్రో నగరాల మధ్య ప్రధాన జంక్షన్‌గా ఉండటంతో, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండి, వాణిజ్యపరంగా కూడా సూర్యాపేట రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రబిందువుగా మారుతోంది.
గతంలో కేవలం వ్యవసాయ ఆధారిత మార్కెట్‌గా ఉన్న సూర్యాపేట, ఇప్పుడు ఆధునిక నివాస గృహాలకు, భారీ వెంచర్లకు నెలవుగా మారింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషణ ప్రకారం, పట్టణ శివార్లలో ప్లాట్ల ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. గత రెండేళ్ల క్రితం వరకు చదరపు గజం రూ. 8,000 నుండి రూ. 10,000 మధ్య ఉండగా, నేడు అది రూ. 15,000 మార్కును దాటేసింది. ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న వెంచర్లలో అయితే ఈ ధరలు రూ. 20,000 పైమాటే అని రియల్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్, మెడికల్ కాలేజీ , ఐటి హబ్ ఏర్పాటు ప్రణాళికలు ఇక్కడి భూముల విలువను అమాంతం పెంచేశాయి.
పెట్టుబడిదారుల కోణంలో చూస్తే, హైదరాబాద్ వంటి నగరాల్లో స్థలాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లడంతో, సురక్షితమైన, లాభదాయకమైన ప్రత్యామ్నాయంగా సూర్యాపేట కనిపిస్తోంది. ఇక్కడ స్థానికులతో పాటు గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన వారు, హైదరాబాద్ వాసులు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. పట్టణంలో పెరుగుతున్న అపార్ట్మెంట్ సంస్కృతి కూడా మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తోంది.
భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింతగా విస్తరించే అవకాశం ఉండటంతో, రాబోయే ఐదేళ్లలో ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.