స్టార్ హీరోల చేతిలో సొంత బ్యానర్లు ఉండడం మామూలే. మెగాస్టార్ ఇంట్లోనూ నిర్మాణ సంస్థలకు కొదవ లేదు. అప్పట్లో అంజనా ప్రొడక్షన్స్ ఉండేది. ఆ వ్యవహారాలు నాగబాబు చూసుకొనేవారు. ఆ తరవాత గీతా ఆర్ట్స్ ఉండేది. ఇప్పటికీ ఆ సంస్థ ఉన్నా, అందులో చిరంజీవి సినిమాలు చేయడం లేదు. తన కోసమే ప్రత్యేకంగా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థని ఏర్పాటు చేశారు. ఇప్పుడు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్మెంట్స్ కూడా వచ్చింది. చిరు కుమార్తె సుస్మిత కొణిదెల ఈ సంస్థ వ్యవహారాల్ని చూసుకొంటున్నారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నిర్మాణంలో సుస్మిత భాగం పంచుకొన్నారు. ఎలాగూ కూతురే నిర్మాత కాబట్టి, చిరంజీవి పారితోషికం తీసుకోరని అనుకొంటారు. కానీ అలాంటి వెసులుబాట్లు ఏం జరగలేదు. నిర్మాతగా సుస్మిత మెగాస్టార్‌కి ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చేశారు. మిగిలిన సినిమాలకు ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నీ ఈ సినిమాకూ జరిగిపోయాయి. ఈ విషయాన్ని సుస్మిత స్వయంగా వెల్లడించారు.
తెలుగు360కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మెగాస్టార్ పారితోషికానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు సుస్మిత. కొణిదెల ప్రొడక్షన్స్ లో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తే, తనకు పారితోషికం అందిందని, తాను కూడా అలానే పారితోషికం ఇచ్చే ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చారామె. వెంకటేష్ పారితోషికం గురించి కూడా ఆమె మాట్లాడారు. ఆయనకు ఎంత పారితోషికం ఇచ్చారో చెప్పలేదు కానీ, ”వెంకటేష్ గారి స్థాయికి తగ్గ పారితోషికం ఇచ్చారు. ఆయన ఇచ్చిన పారితోషికానికి తగ్గట్టుగానే పని చేశారు. మంచి కథతో వస్తే వెంకటేష్ గారితో పూర్తి స్థాయి సినిమా చేస్తానని నాన్నగారు అనిల్ కి ఆఫర్ ఇచ్చారు. అన్నీ కుదిరితే.. ఆ సినిమాని నిర్మించాలని వుంది. ఆ అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తా” అని చెప్పుకొచ్చారు సుస్మిత. ఓటీటీ, వెండితెర.. ఈ రెండింటినీ సమానంగానే చూస్తానని, మంచి కంటెంట్ అందించే ఛాన్స్ ఎక్కడ వస్తే అక్కడ నిర్మాతగా ప్రాజెక్టులు సెట్స్‌పైకి తీసుకెళ్తానని సుస్మిత వెల్లడించారు.