పరకామణి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం .. కరుడు గట్టిన నేరస్తుల పాత వ్యూహాన్ని అందరి కళ్ల ముందు ఉంచుతోంది. పరిటాల రవి హత్య దగ్గర నుంచి వివేకా హత్య వరకూ అనేక కేసుల్లో సాక్షులు అనుమానాస్పదంగా చనిపోతూంటారు. చివరికి కేసులో సాక్ష్యాలు లేకుండా చేసుకుంటారు. ఈ వ్యవహారంలో ఇప్పుడు పరకామణి కేసు కూడా సాగింది. ఇన్స్పెక్టర్ గా ఉన్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం చిన్న విషయం కాదు.
ఫిర్యాదుదారు సతీషే – ఆయనే కీలకం
పరకామణిలో చోరీ చేస్తున్న రవికుమార్ ను పట్టుకుంది సతీశే. అప్పుడు ఆయన టీటీడీ విజిలెన్స్ లో పని చేస్తున్నారు. ఆయనే కేసు పెట్టారు. ఆయనే రాజీ చేసుకున్నారు. రాజీ చేసుకునే అధికారం ఆయనకు లేదు. కానీ ఆయనపై టీటీడీ పెద్దలు ఒత్తిడి పెట్టారు. తనకెందుకు ఈ రొచ్చు అని ఆయన అన్ని విషయాలు సీఐడీ సిట్ కు చెప్పారు. రెండు సార్లు విచారణకు హాజరయ్యారు. మరోసారి విచారణకు హాజరయ్యే ముందు హత్యకు గురయ్యారు. ఎవరెవరు ఆయనపై ఒత్తిడి చేశారో పూర్తిగా చెప్పి ఉంటే.. సగం కేసు సాల్వ్ అయ్యేది.
మిగతా సాక్షుల్ని, నిందితుల్ని కాపాడుకోవాలి !
పరకామణి చోరీ వ్యవహారంలో అసలు వ్యక్తి రవికుమార్. అతని వద్ద నుంచి ఆస్తుల్ని వైసీపీ నేతలు కొట్టేశారనేది ప్రధాన ఆరోపణలు.అందుకే హైకోర్టు రెండు రకాల దర్యాప్తుల్ని ఆదేశించింది. అతను ఏ విధంగా ఆస్తులు సంపాదించాడు.. ఆ ఆస్తులు ఎవరెవరి పేరు మీదకు వెళ్లాయన్నది తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. ఆయనూ ఇప్పుడు పావుగా మార్చి కోర్టులతో ఆట ఆడించే ప్రయత్నం చేసి.. పిటిషన్లు వేయిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రాణాలకూ ముప్పు ఉండి ఉంటుంది. ఆయను అరెస్టు చేసిఅయినా రక్షించాల్సి ఉంది. ఇతర సాక్షులనూ కాపాడాల్సి ఉంది.
ఆత్మహత్య అని రుద్దడంలోనే దొరికిపోతున్నారు !
సతీష్ కుమార్ రైలు పట్టాలపై అనుమానాస్పదంగా పడి ఉంటే.. పోలీసులు చెప్పక ముందే వైసీపీ నేతలు ఆత్మహత్య అని రుద్దడం ప్రారంభించారు. ఇది వివేకా హత్యకేసులో గుండెపోటు అని ప్రచారం చేసిన వ్యూహమే. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు..?. ఆయనే దొంగను పట్టుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఆయన తలపై బలంగా కొట్టడం వల్లనే చనిపోయారని గుర్తించారు. పోలీసులు అసలు విషయాలు వెలుగులోకి తెస్తే …. హంతకులు కూడా దొరికిపోతారు.


