టీ20 వరల్డ్ కప్లో అసలైన సమరం మొదలవ్వబోతోంది. నాలుగు సమ ఉజ్జీల మధ్య సెమీస్ జరగబోతోంది. ఇక నుంచి ప్రతీ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరగడం ఖాయం. తొలి మ్యాచ్ న్యూజీలాండ్ – సౌతాఫ్రికా, రెండో మ్యాచ్లో ఇండియా – ఇంగ్లండ్ తలపడనున్నాయి. కివీస్ తో పోలిస్తే దక్షిణాఫ్రికా బలంగా ఉంది. కాకపోతే.. న్యూజీలాండ్ ఎప్పటికైనా ప్రమాదకరమైన జట్టే. కాబట్టి హోరా హోరీ పోరు తథ్యం. ఇక రెండో సెమీస్ విషయానికొస్తే.. భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది. సొంత గడ్డపై ఆడడం భారత్ కు కలిసొచ్చే విషయం. బ్యాటింగ్ లో అబేధ్యంగా కనిపిస్తోంది. ఎనిమిదో నెంబర్ వరకూ బ్యాటర్లే. వాళ్లలో సింగిల్ హ్యాండ్ తో గెలిపించే సత్తా ఉన్నవాళ్లే ఎక్కువ. బౌలింగ్ లోనూ భారత్ సమతుల్యం పాటిస్తోంది. ఫాస్ట్, స్పిన్… అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. బుమ్రా యార్కర్లు, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలం కలిసొస్తే.. భారత్ ని ఆపడం అసాధ్యం.
అయితే ఇంగ్లండ్ ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టులోనూ మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు. సాల్ట్ హిట్టింగ్ కి దిగితే ఆపడం కష్టం. బట్లర్ ఫామ్ లోకి వస్తే విధ్వంసం సృష్టించగలడు. కెప్టెన్ బ్రూక్ మంచి ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ విషయానికొస్తే భారత్ కంటే ఈ విభాగంలో ఇంగ్లండ్ బలంగా ఉంది. ఆర్చర్, రషీద్ ఇంగ్లండ్ కు అండ, దండ. మరీ ముఖ్యంగా ఆల్ రౌండర్లకు కొదవ లేదు. శామ్ కరన్, జాక్స్.. బంతితోనూ, బ్యాట్ తోనూ సత్తా చాటుతున్నారు. వీళ్లలో చాలామంది భారత్ లో ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్ పుణ్యాన ఇక్కడి పరిస్థితుల్ని వాళ్లు ఔపాశన పట్టేశారు. భారత ఆటగాళ్ల బలాలు, బలహీనతలపై వాళ్లకు అనుభవం వుంది. సో.. ఇంగ్లండ్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయకూడదు. దానికితోడు భారత్ అబేధ్యమైన జట్టేమీ కాదు. సూపర్ 8లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్లో భారత్ బలహీనతలు బయటపడ్డాయి. అభిషేక్ ఫామ్ లో లేకపోవడం లోటు. దూబే బ్యాటింగ్ లో రాణిస్తున్నా.. బౌలింగ్ లో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. టీ20లో ఒక్క ఓవర్ చాలు. మ్యాచ్ స్వరూపం మారిపోవడానికి. పైగా ఇది వరల్డ్ కప్. చిన్నచిన్న తప్పులకూ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. భారత్ ఫైనల్ లోకి అడుగు పెట్టాలంటే సెమీస్ లో ఇంగ్లండ్ పై సర్వ శక్తులూ ఒడ్డాల్సిందే.
