శంకర్ కెరీర్ ఎప్పుడూ లేనంత తిరోగమన స్థితిలో పడిపోయింది. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ ఫలితాలు శంకర్ సామర్థ్యంపై ప్రశ్నలు రేకెత్తించేలా చేశాయి. ఇవి రెండూ డిజాస్టర్లే. ఇప్పుడు శంకర్ని పిలిచి, అవకాశం ఇవ్వడమే గగనం. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ 3 మళ్లీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
‘ఇండియన్ 3’కి సంబంధించి కొంత మేర షూటింగ్ జరిగింది. మరికొంత పెట్టుబడి పెడితే – పార్ట్ 3 రెడీ అవుతుంది. కానీ లైకా ప్రొడక్షన్ సంస్థ ఇప్పుడు శంకర్ ని నమ్మి మళ్లీ డబ్బులు పెట్టడానికి రెడీగా లేదు. కాకపోతే ఆల్రెడీ కొంత భాగం షూట్ చేశారు. అయ్యిందేదో అయిపోయింది, మరికొంత పెట్టుబడి పెడితే సినిమా ఒకటి చేతిలో ఉంటుంది కదా? అనే అభిప్రాయానికి లైకా సంస్థ వచ్చింది. కాకపోతే… శంకర్, కమల్ హాసన్ లతో లైకాకు ఇప్పుడు సత్సంబంధాలు లేవు. శంకర్ విషయంలో ఆ సంస్థ కోర్టుకు కూడా వెళ్లింది. ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య రాజీ కుదరాలి. ఆ బాధ్యత రజనీకాంత్ తన నెత్తిమీద వేసుకొన్నట్టు తెలుస్తోంది. శంకర్, కమల్ తరపున లైకా సుభాస్కరన్తో మాట్లాడి, ఇండియన్ 3 సినిమాని పూర్తి చేయించాలని రజనీ భావిస్తున్నార్ట. లైకాతో రజనీకి మంచి అనుబంధం ఉంది. రజనీ మాట లైకా కాదనలేదు. పైగా శంకర్, కమల్ హాసన్లకు రజనీ ఆప్త మిత్రుడు. కాబట్టి ఈ మధ్యవర్తిత్వం వర్కవుట్ అయ్యేట్టే కనిపిస్తోంది. కాకపోతే.. ఇప్పుడు ఇండియన్ 3 విడుదలైనా జనాలు చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? అనేదే పెద్ద ప్రశ్న. పార్ట్ 2 డిజాస్టర్ అవ్వడంతో ప్రేక్షకులు ఇప్పుడు పార్ట్ 3 చూసేంత రిస్క్ తీసుకొంటారని అనుకోవడం అత్యాసే. కానీ లైకా ఆలోచనలు వేరు. పార్ట్ 3ని నేరుగా ఓటీటీకి ఇచ్చేస్తే లాభదాయకంగా ఉంటుందని భావిస్తోంది. అలా చేయగలిగితే పార్ట్ 3 వరకూ అయినా పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకొనే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించి కమల్, శంకర్లకు పారితోషికం బాకీ పడింది లైకా సంస్థ. ఓటీటీ డీల్ సెట్ అయితే.. ఇటు శంకర్, అటు కమల్ లకు కూడా లాభమే. ఆ రూపంలో అయినా వాళ్ల రెమ్యునరేషన్ రాబట్టుకోవొచ్చు.