తెలంగాణా పట్ల మరీ ఇంత వివక్షా?

తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణా రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చాలా చేసేస్తోందని బీజేపీ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గొప్పలు చెప్పుకొంటుంటారు. వరంగల్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తే కేంద్రప్రభుత్వం ఇంకా చాలా సహాయం అందిస్తుందని వారు హామీలు ఇస్తున్నారు. కానీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రా, తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో పేదల కోసం మొత్తం 2,28,204 ఇళ్లను మంజూరు చేయగా వాటిలో 85 శాతం ఇళ్ళు అంటే 1,93,147 ఇళ్ళను తన స్వంత రాష్ట్రమయిన ఆంధ్రప్రదేశ్ కే కేటాయించుకొన్నారు. తెలంగాణా రాష్ట్రానికి కేవలం 10,000 ఇళ్ళను మాత్రమే మంజూరు చేసారు. కేంద్రప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలి తప్ప ఒకరాష్ట్రాన్ని ఒకలాగ మరొక రాష్ట్రాన్ని ఇంకొకలాగ చూడరాదు. ఆంధ్రాలో 13 జిల్లాలు ఉంటే, తెలంగాణాలో 10 జిల్లాలు ఉన్నాయి. కానీ ఆంధ్రాకి సుమారు రెండు లక్షల ఇళ్ళు, తెలంగాణాకి కేవలం 10,000 ఇళ్ళు మంజూరు చేయడం చూస్తే కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల ఎంత వివక్ష చూపుతోందో అర్ధమవుతోంది. మరి అటువంటప్పుడు బీజేపీ అభ్యర్ధికి ఓటు వేసినా ఏమి ప్రయోజనం ఉంటుంది? తెలంగాణా పట్ల మరీ ఇంత వివక్ష చూపవలసిన అవసరం ఉందా?” అని ఆయన ప్రశ్నించారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా సహేతుకమయిన ప్రశ్న అడిగారని చెప్పవచ్చును. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా చితికిపోయింది…మళ్ళీ దానిని పునర్నిర్మించుకోవాలి కనుక కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ఉన్నత విద్యాసంస్థలు, ప్రాజెక్టులు చకచకా మంజూరు చేస్తోంది. అందుకు తెలంగాణా నేతలు కానీ ప్రజలు గానీ ఏనాడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. వారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని భావిస్తున్నారు కనుకనే అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసేందుకు ఓడిస్సా, తమిళనాడు వంటి రాష్ట్రాలు అభ్యంతరం చెపుతున్నప్పటికీ తెలంగాణా మాత్రం అభ్యంతరం చెప్పలేదు. పైగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.

కానీ ఈ పేదల ఇళ్ళ నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం చేసిన కేటాయింపులతో రాష్ట్రాభివృద్ధితో ముడిపడి ఉండదు కనుక ఆ ఇళ్ళను ఐదు రాష్ట్రాలకు సమానంగా పంచి ఇవ్వవచ్చును లేదా అవసరమనుకొంటే ఆంధ్రాకు మిగిలిన వాటి కంటే మరో ఐదో పదో శాతం అదనంగా కేటాయించినా ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పరు. కానీ ఏకంగా 85 శాతం ఇళ్ళు ఆంధ్రాకే కేటాయించి మిగిలిన 15 శాతం ఇళ్ళను నాలుగు రాష్ట్రాలకు పంచిపెడితే ఎవరయినా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అది సహజం కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com