‘మా’ రాజకీయాలు, అక్కడ రేగుతున్న ఆరోపణలు, పరస్పర విమర్శలు – టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయాలపై ఇండ్రస్ట్రీ పెద్దలు ఇప్పటికీ మౌనంగానే ఉండడం, ఏం జరగట్టు వ్యవహరించడం మరింత అనుమానాల్ని రేకెత్తిస్తోంది. `మా` వ్యవహారంపై.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల కొంతమంది సినీ పాత్రికేయులు మంత్రిని గౌరవ పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా `మా` రాజకీయాల టాపిక్ వచ్చినప్పుడు… మంత్రి తన అసహనాన్ని ప్రదర్శించారని తెలుస్తోంది. నిండా వెయ్యిమంది లేని `మా`లో ఇన్ని రాజకీయాలా? అంటూ మంత్రి కూడా ఆశ్చర్యాన్ని అసహనాన్ని వ్యక్తం చేశార్ట. ఈ వ్యవహారంలో తాను కూడా జోక్యం చేసుకోనని, అది తన పరిధిలో లేని విషయమని మంత్రి అన్నట్టు తెలుస్తోంది.
`మా` కి స్థలం కేటాయించే విషయంపైనా తలసాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. టాలీవుడ్ లో.. కోట్లకు పడగెత్తిన నటీనటులు ఉన్నారని, వాళ్లంతా తలో చేయీ వేస్తే `మా` భవనం అసలు ఏమాత్రం సమస్య కాదని.. మంత్రి తేల్చి చెప్పారని తెలుస్తోంది. తలసాని వ్యాఖ్యల్ని బట్టి చూస్తే.. `మా` ఎదరరు చూస్తున్న స్థలం.. ఇప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేట్టు కనిపించడం లేదు. మా కోసం స్థలం నేను సంపాదిస్తా.. అంటే నేను సంపాదిస్తా అంటూ.. స్టేట్మెంట్లు ఇవ్వడం మినహా – మన స్టార్లు కూడా చేసేదేం లేదన్న విషయం అర్థమైపోతూ ఉంది. ఇలా వాళ్లలో వాళ్లు గొడవ పడితే – జనానికి లోకువ. ఈ విషయాన్ని `మా` ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.